తూప్రాన్: ప్రధాన రహదారులపై ఏఐ కెమెరాలు నిఘా వేస్తున్నాయి. పోలీసుల పర్యవేక్షణలో ఆర్టీఫిషల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగిస్తున్నారు. సూక్ష్మంగా కనిపించే వాహనాల నంబర్లు సైతం అతి పెద్దగా చూపించడం ఈ కెమెరాల ప్రత్యేకత. అంతేకాకుండ పరిసరాల్లో వ్యక్తులను స్పష్టంగా చూపుతూ అక్కడ ఇతర వాహనాలను సైతం ఈ కెమెరాలు పసిగడుతాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులు, వాహనాలపై పారిపోతున్నప్పుడు, నేరచరిత్ర కలిగిన అగంతకుల గుర్తింపులో ఈ కెమెరాలు కీలక భూమిక పోషిస్తాయి. ఒకే నంబరు మీద ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయో గుర్తిస్తాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి చలాన్లను ఎగవేస్తున్న వాహనదారులనూ గుర్తిస్తాయి. ట్రాఫిక్ నిబంధనలు అధిగమిస్తే దానిని సైతం పోలీసులకు చేరవేస్తుంది. వివిధ సందర్భాల్లో నేర సంబంధ అంశాలను సులువుగా గుర్తించేందుకు ఏఐ టెక్నాలజీతో సీసీ కెమెరాలను వినియోగంలోకి తీసుకొచ్చినట్లు ఎస్‌ఐ శివానందం తెలిపారు. వాటి పని తీరును వివరించారు. పోలీస్ స్టేషన్‌లో ఏఐ కంట్రోల్‌రూంను ఏర్పాటు చేశామని, వీటికి అనుసంధానంగా తూప్రాన్ ప్రధాన రహదారిపై నాగులపల్లి, నర్సాపూర్ చౌరస్తాలు, పోతరాజుపల్లి కమాన్‌వద్ధ మూడు కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కో కెమెరా రూ.1.50 లక్షల విలువ ఉంటుందన్నారు. ఈ కెమెరాలు సీఎస్‌ఆర్(కార్పోరేట్ సోషల్ రేస్పాన్సిబిల్టి) కింద వివిధ పరిశ్రమల సహాకారంతో ఏర్పాటు చేశామన్నారు. ఇవే కాకుండ మరో ఐదు ఏఐ కెమరాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగ మరో 110 సాధారణ సీసీ కెమరాలను పట్టణంలో నిఘా కోసం ఏర్పాటు చేసినట్లు వివరించారు.
నేర నియంత్రణలో కీలక భూమిక
సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తున్న తూప్రాన్ పోలీసులు