
నిబంధనలు పాటించాల్సిందే
75 టపాసుల దుకాణాల ఏర్పాటుకు అనుమతి
మెదక్‌జోన్: మెదక్ జిల్లాలోని 21 మండలాలు, 491 గ్రామాలతో పాటు మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో టపాసుల కేంద్రాలను ఏర్పాటు చేసిన దుకాణదారులు తప్పనిసరిగా ఆయా శాఖల నుంచి అనుమతులు పొందాలని అధికారులు చెబుతున్నారు. పండుగ రెండురోజుల్లో ఉండటంతో అవగాహన కల్పిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంటున్నారు.
నిబంధనలివే
● టపాసుల దుకాణాలను పట్టణాలకు, జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రజల ప్రాణాలకు, ఆస్తికి ఎలాంటి నష్టం జరగనంత దూరంగా ఉండాలి.
● ఒక్కో షాపునకు 3 మీటర్ల దూరం ఉండాలి. షాపులో అగ్ని ప్రమాదం జరిగితే మరో షాపునకు నష్టం జరగకుండా ఉండాలి.
● ఒక్కో దుకాణం వద్ద 200 లీటర్ల వాటర్ డ్రమ్ముతో పాటు ఇసుకతో కూడిన బకెట్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.
● దుకాణాల వద్ద విద్యుత్ తీగలు వేలాడకుండా చూడాలి. కరెంట్ వైర్లు నాణ్యతతో ఉండేలా లేదా కొత్త వైర్లను ఏర్పాటు చేసుకోవాలి.
ఆరింటిని తిరస్కరించాం
మెదక్ జిల్లావ్యాప్తంగా టపాసుల దుకాణా ల ఏర్పాటుకు 81 దరఖాస్తులొచ్చాయి. వాటిలో డాక్యుమెంట్స్ సరిగా లేని ఆరు దరఖాస్తులను తిరస్కరించాం. మిగతా వాటికి అనుమతులు ఇచ్చాం.
–వేణు, అగ్నిమాపక అధికారి మెదక్