పనిచేసే వారికే పట్టం కట్టండి | - | Sakshi
Sakshi News home page

పనిచేసే వారికే పట్టం కట్టండి

Oct 6 2023 7:02 AM | Updated on Oct 6 2023 7:02 AM

మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు - Sakshi

మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

డబ్బు సంచులతో వచ్చే వారితో

జాగ్రత్తగా ఉండాలి

గతుకుల మెదక్‌.. బతుకుల మెదక్‌గా మార్చింది కేసీఆర్‌

ఎవరెన్ని ట్రిక్కులు చేసినా ఆయనే హ్యాట్రిక్‌ సీఎం

జిల్లా అభివృద్ధికి కృషి చేసిన పద్మక్కను మళ్లీ గెలిపించుకుందాం

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

మెదక్‌: పనిచేసేవారికే పట్టం కట్టాలని, డబ్బు సంచులతో వచ్చే వారితో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం జిల్లాలో పర్యటించిన మంత్రి మెడికల్‌ కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం సీఎస్‌ఐ చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. డబ్బుసంచులతో హైదరాబాద్‌ నుంచి గుండాలు మెదక్‌ వస్తున్నారని జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ గెలిస్తే మీ పరిస్థితి పెద్ద పాము మింగినట్లు ఉంటుందని పరోక్షంగా మైనంపల్లి హన్మంతరావును ఉద్దేశించి మాట్లాడారు. గొర్రెల మందమీద తోడేళ్లు దాడి చేసినట్టు ఒక శాసన సభ్యురాలి మీద దాడి చేస్తున్నారని, డబ్బుల కట్టలు గెలవాలా.. పనిచేసే పద్మక్క గెలవాలో ఆలోచించుకోవాలన్నారు. గతుకుల ప్రాంతమైన మెదక్‌ను సీఎం కేసీఆర్‌ అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి బతుకుల మెదక్‌గా తీర్చిదిద్దారని, జిల్లా ఏర్పాటు, రైలురాక, మెడికల్‌ కాలేజీ రావడంలో పద్మక్క కృషి ఎంతో ఉందన్నారు. ఎంసీహెచ్‌ ఏర్పాటుతో 80 శాతానికి పైగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. మెడికల్‌ కళాశాల కోసం రూ.180 కోట్లు కేటాయించామని, భవనంతో పాటు త్వరలో 450 పడకల ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందని అన్నారు. 150 మంది వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తారన్నారు. గణపురం ఆయకట్టు పెంచి కాలువలు మరమ్మతులు చేశాక చివరి ఆయకట్టుకూ నీరందుతుందన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో మంచి నీళ్లకు తిప్పలు ఉండేవని, నేడు ఇంటింటికి సురక్షిత నీరు అందిస్తున్నామని వివరించారు.

ఎరుకల సాధికారత పథకం ప్రారంభం...

కులవృత్తులను ప్రోత్సహించేందుకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని, ఎరుకల కులం వారి కోసం (ఎరుకల సాధికారత పథకాన్ని) ప్రవేశ పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద రూ.60 కోట్లు కేటాయించామని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పందుల పెంపకానికి భూమితో పాటు మాంసాన్ని విక్రయించుకునేందుకు మార్కెట్‌ సౌకర్యం, సబ్సిడీ వాహనాలు సైతం అందిస్తామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పద్మాదేవేందర్‌రెడ్డికి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకు ముందు కలెక్టరేట్‌లో ఎరుకల సాధికారత పథకం ప్రారంభంలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. ఆధునిక యంత్రాలతో కులవృత్తులు అంతరించి పోతున్న సమయంలో బీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన పథకాలు పునరుజ్జీవం ఇచ్చాయన్నారు. గిరిజన తండాలను పంచాయతీలుగా చేసి అభివృద్ధికి బాటలు వేశారని, స్వాతంత్య్రం వచ్చాక ఎరుకల గురించి ఆలోచించిన నాయకుడు కేసీఆర్‌నేనని అన్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డి మాట్లాడుతూ.. అన్ని కులాల వారిని అక్కున చేర్చుకుని వారి అభివృద్ధి ధ్యేయంగా ఆదుకుంటున్నామన్నారు. నేడు మెదక్‌ జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధిలో ముందంజలో ఉండటానికి సీఎం కేసీఆర్‌ కారణమని, మరోసారి బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. క్యాక్రమంలో ట్రైకా చైర్మన్‌ రాంచందర్‌నాయక్‌, గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి, క్రిస్టినా జెడ్‌ చోంగ్తూ, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ లావణ్యరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, రాగి అశోక్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement