చెత్త.. తడి, పొడి లేదు! | - | Sakshi
Sakshi News home page

చెత్త.. తడి, పొడి లేదు!

Nov 26 2026 12:24 AM | Updated on Nov 26 2026 12:24 AM

డంపింగ్‌యార్డులో నిండిన వైనం

సెగ్రిగేషన్‌ చేసే చోటనే డంపింగ్‌

శాశ్వత స్థలం కరువు

సేంద్రియ ఎరువుగా మార్చే ప్రక్రియకు అడ్డంకులు

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల మున్సిపాల్టీ గ్రేడ్‌–1గా ఉన్నప్పటి నుంచే చెత్త డంపింగ్‌యార్డుకు శాశ్వత స్థలం కరువైంది. జిల్లా కేంద్రం, మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మారడంతో నివాసాలు పెరిగి ప్రతీ రోజు వెలువడుతున్న చెత్త పెరిగిపోతోంది. నగరంలోని ఆండాళమ్మకాలనీలో తడి, పొడి చెత్త వేరు చేసేందుకు పొడి వనరుల సేకరణ కేంద్రం(డ్రై రిసోర్స్‌ కలెక్షన్‌ సెంటర్‌(డీఆర్‌సీసీ)) ఏర్పాటు చేశారు. మొదట్లో చెత్తను వేరు చేసే కార్యక్రమం చేపట్టారు. ఆ తర్వాత తడి, పొడి చెత్తను కలిపి సేకరించి డీఆర్‌సీ కేంద్రంలో వేస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువులు తయారు చేయాల్సి ఉండగా ఆ కేంద్రాన్ని చెత్త డంపింగ్‌ యార్డుగా మార్చేశారు. చెత్తను వేరు చేయకపోవడంతో గుట్టలుగా పేరుకుపోతోంది. ప్రతీ రోజు ఏదో ఒక చోట నిప్పు చెలరేగి చెత్త కాలిపోతూ పొగతోపాటు దుర్వాసన వెదజల్లి స్థానిక ప్రజలను నిద్ర లేకుండా చేస్తోంది. మంచిర్యాల మున్సిపాల్టీగా ఏర్పడిన సమయంలో ఆండాళమ్మ కాలనీ పట్టణానికి దూరంగా ఉండడంతో ఈ ప్రాంతంలో చెత్త వేసేందుకు తాత్కాలికంగా డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేశారు. పట్టణం నగరంగా మారి ఇళ్ల నిర్మాణం, కాలనీలు పెరిగి డంపింగ్‌ యార్డు వరకూ విస్తరించాయి. సమీప కాలనీ ప్రజల నుంచి తరచూ ఫిర్యాదు రావడంతో డంపింగ్‌ యార్డును డీఆర్‌సీసీగా మార్చారు. చెత్త నిల్వతో ఈ ప్రాంత ప్రజలు అనారోగ్యం బారిన పడతారని, తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుగా మార్చే ప్రక్రియ చేపట్టేందుకు రెండు షెడ్లు ఏర్పాటు చేశారు. కానీ చెత్తను వేరు చేయకపోవడంతో డీఆర్‌సీ కేంద్రంలో గుట్టలుగా పేరుకుపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement