దండేపల్లి: ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో రైతులు ఏ పంటలు వేసుకోవాలి, ఏవి వేసుకోవద్దో వ్యవసాయ, విద్యుత్ అధికారులు, ఎమ్మెల్యే రైతులకు స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ డిమాండ్ చేశారు. మండలంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని స్థానిక బీజేపీ నాయకులతో కలిసి బుధవారం దండేపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. సమస్యలపై ఏఈ బాపుతో మాట్లాడిన అనంతరం ఎస్ఈ రాజన్నతో ఫోన్లో మాట్లాడారు. యాసంగిలో ఎన్ని గంటలు కరెంటు ఇస్తారో ముందే తెలియజేస్తే అందుకు తగ్గట్టుగా రైతులు ముందుకెళ్తారని అన్నారు. కొందరు రైతులు వరినార్లు పోసుకుంటున్నారని, గూడెం ఎత్తిపోతల ద్వారా సాగునీరు ఇస్తారో లేదో చెప్పాలని తెలిపారు. బీజేపీ నాయకులు నందుర్క సుగుణ, పత్తిపాక సంతోష్, నలిమెల మహేష్, ఎంబడి సురేందర్, రమణయ్య, డాంక లక్ష్మణ్, రాకేష్, శ్రీనివాస్, మల్లేష్, సత్తయ్య, శంకరయ్య, ఈశ్వర్‌నాయక్ పాల్గొన్నారు.


