జన్నారం: అప్పుల బాధతో ఆటో డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జన్నారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన బాదావత్ రాజ్య నాయక్ (42) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని ఆటోకు రిపేర్ రావడంతో అప్పులు చేసి మరో రెండు ఆటోలు కొనుగోలు చేశాడు. కాగా నెల క్రితం ఒక ఆటో బోల్తా పడింది. దెబ్బతిన్న ఆటోను బాగు చేసుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై ఈనెల 3న పురుగులమందు తాగి చింతగూడ గ్రామ శివారు గోదావరి ఒడ్డున పడి ఉండగా కుటుంబ సభ్యులు జన్నారంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. రాజ్యనాయక్ భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు ఆయన కళ్లను దానం చేశారు.


