ఆర్టీసీలో ఫుట్‌బోర్డ్ ప్రయాణాలకు చెక్ ప్రయాణికుల భద్రతపై యాజమాన్యం నిర్ణయం పల్లెవెలుగుల్లో అమలుపై సందేహం
మంచిర్యాలఅర్బన్: టీజీఎస్‌ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల భద్రతను నిర్ధారించేందుకు యాజమాన్యం చర్యలు తీవ్రతరం చేసింది. అన్ని బస్సుల్లో ప్యాసింజర్ డోర్లు మూసివేసి వాహనాలు నడపాలని ఆదేశించింది. డిపో పరిధిలోని అన్ని బస్సుల్లో డోర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా..? పరిశీలించి తలుపులు మూసి నడిపేలా చర్యలు చేపట్టాలని, ఈప్రక్రియపై నవంబర్ 7లోపు నివేదిక ఇవ్వాలని డిప్యూటీ రీజనల్ మేనేజర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు.
ప్రమాదాల నివారణకు..
బస్సులకు డోర్లు ఉన్నప్పటికీ తెరిచి ఉంచి నడపటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో డోర్లు మూసిన తర్వాతే బస్సును స్టార్ట్ చేయాలని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ రీజియన్‌లో మొత్తం 647 బస్సులు నడుస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి స్లీపర్ కోచ్ బస్సులన్నింటికీ తలుపులున్నాయి. పల్లెవెలుగుల్లో కొన్నింటికి డోర్లు అందుబాటులో ఉన్నా తలుపులు వేయకుండానే నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేసింది. తమ పరిధిలోని బస్సుల్లో ప్యాసింజర్ డోర్లు సరిగా పని చేస్తున్నాయో లేదో తనిఖీ చేసి తలుపులు మూసిన తర్వాత బస్సులు ప్రారంభించాలని సూచించింది.
పల్లె వెలుగులో సాధ్యమేనా..?
హైదరాబాద్ దూర ప్రాంతాలకు వెళ్లే లహరీ, లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో డోర్లు మూసి బస్సులు నడపటం మాటేలా ఉన్నా.. పల్లె వెలుగుల్లో సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్రంలో మహల క్ష్మీ ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వ చ్చిన్నప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపైంది. గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణికుల రద్దీ నియంత్రించలేనంతగా పెరిగిపోయింది. ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడంతో ఉన్న బస్సులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. చాలా రూట్లలో ప్రయాణికులు ఫుట్‌బోర్డ్‌లపై, తలు పుల వద్ద ప్రమాదకరంగా నిలబడి ప్రయాణిస్తుంటారు. 55 సీట్ల సామర్థ్యం ఉన్న పల్లె వెలుగులో ప్ర యాణికుల సంఖ్య 80 నుంచి 100కు పైగా ఉంటోంది. బస్సు లోపల ఖాళీ లేక తలుపుల వద్దే ఊగులాడుతుంటారు. ఈ పరిస్థితుల్లో సిబ్బంది తలుపులు మూయడం సాధ్యమేనా అనేది తేలాల్సి ఉంది.
అదనపు బస్సు సర్వీసులతో..
కేవలం నిబంధనలు కఠినతరం చేయడమే కాకుండా పెరిగిన రద్దీకి అనుగుణంగా రూట్ల వారీగా మరిన్ని అదనపు పల్లెవెలుగు బస్సులను అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఫిజికల్ డోర్ల కంటే డ్రైవర్ నియంత్రించే ఆటోమెటిక్ డోర్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టి డోర్ మూస్తే తప్ప బస్సు ముందుకు కదలని సాంకేతికతను తీసుకురావాలని సూచిస్తున్నారు. బస్సు నిండిన తర్వాత సురక్షితంగా డోర్లు మూసి ప్రయాణం కొనసాగించేలా డ్రైవర్లు, కండక్టర్లకు ప్రయాణికులు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది.
ఆదిలాబాద్ రీజియన్‌లో బస్సుల వివరాలు..


