మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేటలో ఈనెల 2న లగిశెట్టి దేవక్క మెడలోంచి గొలుసు చోరీ చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఏసీపీ ప్రకాశ్ తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుడిపేటకు చెందిన దేవక్క సోమవారం ఉదయం తన ఇంటి ముందు ఉండగా ములుగు జిల్లా వెంకటాపూరం మండలానికి చెందిన ముత్యబోయిన ప్రేమ్‌చంద్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం దుగినేపల్లికి చెందిన డోలే చంద్రకాంత్ స్కూటీపై వచ్చి ఆమె మెడలోంచి బంగారు మంగళసూత్రం లాక్కుని కిందకు తోసేసి పారిపోయారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో భాగంగా మంచిర్యాల బైపాస్ రోడ్లో చేపట్టిన తనిఖీల్లో ఇద్దరు దొంగలు పట్టుబడ్డారు. విచారణలో మంచిర్యాల నగరంలోని అనిల్‌కుమార్ అనే స్వర్ణకారుడికి గొలుసు కరిగించి ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పడంతో మంచిర్యాల ఆర్పీ రోడ్‌లోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న తన వర్క్‌షాప్‌కు తీసుకువెళ్లి బంగారు గొలుసును మూడు ముద్దలుగా చేసి ముగ్గురూ పంచుకున్నారు. ప్రేమ్‌చంద్ పరారీలో ఉండగా చంద్రకాంత్, స్వర్ణకారుడు అనిల్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రెండు బంగారు ముద్దలు, స్కూటీ, రెండు మోబైల్ ఫోన్లు, బంగారం కరిగించడానికి వినియోగించిన పనిముట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


