మంచిర్యాలఅగ్రికల్చర్: వేసవిలో ప్రజలకు నిరంతరాయంగా సురక్షిత తాగునీరు సరఫరా చేసేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. మంగళవారం అదనపు కలెక్టర్ చాంబర్‌లో గ్రామీణ నీటి సరఫరా ఈఈ వెంకటేశ్, మిషన్ భగీరథ ఈఈ మధుసూదన్‌తో కలిసి ఎంపీడీవోలు, ఎంపీవోలు, డీఈలు, ఏఈలతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 15వ నుంచి డిసెంబర్ 31వరకు ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా తాగునీరు సరఫరా చేసేలా, మౌలిక వసతుల పనితీరు మెరుగుపరిచేలా, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పైపులైన్లలో లీకేజీలు, వాల్వ్‌ల పనితీరు, నీటి సరఫరా వ్యవస్థలోని లోపాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు, గ్రౌండ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్లు, మ్యాన్‌హోల్స్‌ను శుభ్రపర్చడంతోపాటు నీటి ట్యాంకులకు క్లోరినేషన్ నిర్వహించాలని, బ్లీచింగ్ పౌడర్ వినియోగించి తాగునీటి నాణ్యతను నిర్ధారించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే అవకాశమున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ నీటి వనరులు, సరఫరా మార్గాలను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్య ఎదురైతే అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు 1916 టోల్ ఫ్రీ నంబర్‌పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని సూచించారు.


