నిర్మల్: ‘ఛత్రపతి శివాజీ వారసులకు, కత్తిలాంటి కార్యకర్తలకు జన్మనిచ్చిన నిర్మల్‌గడ్డకు దండాలు’ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ జోష్ నింపారు. ‘జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలను చూస్తుంటే వచ్చేది మన ప్రభుత్వమే అని స్పష్టమవుతోంది’ అని ఎంపీ ఈటల రాజేందర్ ఉత్సాహాన్ని పెంచారు. ‘వర్షాన్ని లెక్కచేయకుండా వెంట నడిచిన కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవా దాలు’ అన్న స్థానిక ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి మాటలు కార్యకర్తలను ఆకట్టుకున్నాయి. ఓట్ చోరీ అంటూ కాక్రోచ్, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు, ప్రజల్లోకి తమ వాదనను తీసుకెళ్లేందుకు ఉత్తర తెలంగాణలో బీజేపీ నిర్వహించిన తొలి మహాపాదయాత్ర విజయవంతమైంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం దాదాపు నాలుగు గంటలపాటు సాగిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నిరసనలకు భారీ జనసమీకరణతో పార్టీ సమాధానం చెప్పడం కాషాయదళంలో కొత్త ఉత్సాహం నింపింది. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి, ఈ కార్యక్రమ ముఖ్యఅతిథి సునీల్ బన్సల్ సభలో మాట్లాడకపోవడం గమనార్హం.
రెండు గంటలు నడిచి..
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ రోడ్డు హెలిప్యాడ్ వద్ద కు మధ్యాహ్నం 12గంటల తర్వాత బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌బన్సల్ చేరుకున్నారు. ఆయనతోపాటు మిగతా నేతలందరూ కలిసి ప్రత్యేక వాహనంలో స్థానిక శాంతినగర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడి నుంచి.. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన సునీల్‌బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, రాష్ట్ర సహ ఇన్‌చార్జీలు రేఖాశర్మ, అభయ్‌పాటిల్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఆదిలాబాద్, మల్కాజ్‌గిరి ఎంపీలు గోడం నగేశ్, ఈటల రాజేందర్, ముధోల్, ఆదిలాబాద్, సిర్పూర్, ఆర్మూర్, నిజామాబాద్ ఎమ్మెల్యేలు రామారావుపటేల్, పాయల్ శంకర్, పాల్వాయి హ రీశ్, రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్, సీనియర్ నాయకులు, అధికసంఖ్యలో వచ్చిన కార్యకర్తలతో కలిసి మహాపాదయాత్ర ప్రారంభించారు. శాంతినగర్ చౌరస్తా నుంచి శివాజీచౌక్, చైన్‌గేట్, జయశంకర్ సర్కిల్ మీదుగా వివేక్‌చౌక్ వరకు దాదాపు రెండు గంటలు సాగిన మహాపాదయాత్రలో పాల్గొన్నారు. వివేక్‌చౌక్‌లో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడారు.
సభలో మాట్లాడని సునీల్ బన్సల్..
బీజేపీ మహాపాదయాత్రలో తెలంగాణతోపాటు బెంగాల్, ఒడిశా రాష్ట్రాల ఇన్‌చార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌తోపాటు రాష్ట్ర సహ ఇన్‌చార్జిలు రేఖాశర్మ, అభయ్‌పాటిల్ పాల్గొన్నారు. సభలో ముందుగా రేఖాశర్మ మాట్లాడారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు మాట్లాడారు. కానీ.. సునీల్ బన్సల్ మాట్లాడలేదు. దీనిపై పార్టీ సీనియర్ నేతలను సంప్రదించగా, ఆయన పార్టీ సంస్థాగత బాధ్యుడని తెలిపారు. బహిరంగసభలలో ఆయన మాట్లాడరని పేర్కొన్నారు.


