తిర్యాణి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు ఏకంగా పాఠశాలలోనే మద్యం సేవిస్తూ పట్టుబడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ మూడు రోజులుగా పాఠశాలకు మద్యం సేవించి వస్తున్నాడు. మంగళవారం సైతం పాఠశాల అవరణలో మద్యం సేవించగా పలువురు తల్లిదండ్రులు గుర్తించి ఎంఈవోకు సమాచారం అందించారు. ఎంఈవో అంజయ్య పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రధానోపాధ్యాయుడిపై శాఖపరమైనా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో సర్పంచ్ కిష్టయ్య, మాజీ సర్పంచ్ ముత్యం రాజయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.


