దహెగాం: మండలంలో కల్వాడ వద్ద అక్రమంగా తరలిస్తున్న పశువులను పట్టుకున్నట్లు ఎస్సై చుంచు రమేశ్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం కన్నెపల్లి మండలం లింగాల నుండి జగిత్యాల జిల్లా రాజారాంపల్లి మార్కెట్‌కు వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఆరు పశువులను కల్వాడ వద్ద పట్టుకుని గోశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. లింగాలకు చెందిన అజీజ్ ఖాన్, బెల్లంపల్లికి చెందిన సొహెల్ ఖాన్, జహీర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడికి తీవ్రగాయాలు
ఇంద్రవెల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని చిన్నదంపూర్ గ్రామానికి చెందిన మండాడి కిషన్, సిడాం కృష్ణ మంగళవారం ఇంద్రవెల్లి మండలంలోని డొంగర్‌గాంకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వొల్మద్రి గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. కృష్ణకు తీవ్రగాయాలు కావడంతో 108లో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. కృష్ణ పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.
కవ్వాల్‌లో మచ్చల గుడ్లగూబ
జన్నారం: మచ్చల గుడ్లగూబ భారత ఉపఖండానికి చెందిన ఒక ప్రత్యేకమైన రాత్రిచర వేట పక్షి. ఇది గుడ్లగూబల కుటుంబానికి చెందినది. శరీరంపై గోధుమ, తెలుపు రంగుల మచ్చలు, పెద్ద గుండ్రని ముఖం, లోతైన నల్లని కళ్ళు దీని ప్రత్యేక లక్షణాలు. మెడ, ఛాతి, ఉదర భాగాలపై అడ్డమైన గీతలు, మచ్చల వల్ల దీనికి మచ్చల అటవీ గుడ్లగూబ అనే పేరు వచ్చింది. ఇది ప్రధానంగా రాత్రి సమయంలో చురుకుగా ఉండి, పగటిపూట పెద్ద చెట్ల కొమ్మలపై లేదా దట్టమైన ఆకుల మధ్య విశ్రాంతి తీసుకుంటుందని వన్యప్రాణుల పరిశోధకుడు డా.అనగందుల వెంకట్ తెలిపారు. కవ్వాల్ టైగర్‌జోన్ జన్నారం అటవీ డివిజన్ ఇందన్‌పల్లి అడవుల్లో మంగళవారం కనిపించిన గుడ్లగూబను తన కెమెరాలో బంధించాడు.


