మంచిర్యాలక్రైం: జిల్లాలోని దండేపల్లి మండలం తాళ్లపేట, మంచిర్యాల నగరంలో జరుగుతున్న దాడుల ఘటనలపై వాస్తవాల వెలికితీతకు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సీసీఎస్ ఏసీపీ కే.రవీందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ బృందం సంఘటన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత వ్యక్తులు, సాక్షులను విచారించడంతోపాటు సాంకేతిక ఆధారాలను సేకరించి విశ్లేషిస్తుంది. తాళ్లపేట గ్రామంలో బతుకమ్మ పండుగ రోజు జరిగిన గొడవ, మరునాడు రెండు వర్గాల పరస్పర దాడి, అనంతరం పాత మంచిర్యాలలో ఘర్షణ వాతావరణం వాస్తవాల ఆధారంగా సంఘటనలు, సంబంధిత వ్యక్తుల పాత్రను నిష్పక్షపాతంగా నిర్ధారిస్తుంది. మంచిర్యాల, దండేపల్లి పోలీసుస్టేషన్ల పరిధిలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు 24గంటలు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఊహాజనిత, నిర్ధారణ కాని అసత్య సమాచారం నమ్మవద్దని సీపీ ప్రకటించారు. వాటి ఆధారంగా ప్రజలు ఆందోళన చెంది అల్లర్లకు పాల్పడవద్దని హెచ్చరించారు. అసత్య ప్రచారం ప్రజల దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని తెలిపారు.


