రెండ్రోజుల వ్యవధిలో పలువురిపై దాడి
దాడి భయంతో దూకిన మహిళకు గాయాలు
వానర మూకలతో భయాందోళనలు ప్రజలు
చెన్నూర్: చెన్నూర్ పట్టణంలో వానర మూకలు రెచ్చిపోతున్నాయి. దాడులతో ప్రజల్లో దడ పుట్టిస్తున్నాయి. రెండ్రోజుల వ్యవధిలో ఐదుగురిపై దాడి చేయగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏడో వార్డుకు చెందిన నగీషా కోతులకు భయపడి పక్క భవనంపై దూకడంతో కాలు విరిగింది. 15వ వార్డు కౌన్సిలర్ జయలక్ష్మి భర్త కొమ్మెర బ్రహ్మయ్యపై కోతులు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గత పది నెలల కాలంలో 309మంది కోతుల దాడిలో గాయపడ్డట్లు ఆస్పత్రి రికార్డుల ద్వారా తెలుస్తోంది. గత ఏప్రిల్‌లో కౌన్సిల్ సమావేశంలో కోతులు, కుక్కల నియంత్రణకు రూ.6లక్షలు కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కోతులను పట్టుకోలేదు. నిధులు కేటాయించి అధికారులు, పాలకవర్గ సభ్యులు చేతులు దులిపేసుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యం ఇద్దరు ముగ్గురిపై దాడి చేసి గాయపరుస్తున్నా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇళ్లలో దూరి దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చిన్నారులకు బయటకు పంపాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. కోతులను పట్టే ప్రత్యేక బృందాలను రప్పించి బంధించి ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో కోతులు పెద్ద సంఖ్యలో పట్టామని, 300 వరకు మాత్రమే ఉన్నాయని అధికారులు ప్రకటించారు. ఒక్కో గుంపులో వందకు పైగా సంచరిస్తున్నాయని పట్టణ వాసులు అంటున్నారు.
ఈ ఏడాదిలో దాడుల వివరాలు..
నెల సంఖ్య
జనవరి 27
ఫిబ్రవరి 19
మార్చి 30
ఏప్రిల్ 27
మే 27
జూన్ 27
జూలై 35
ఆగస్టు 58
సెప్టెంబర్ 39
అక్టోబర్ 20
మొత్తం 309
చికిత్స చేయించుకోవాలి
కోతులు గాయపరిస్తే చికిత్స చేయించుకోవాలి. నెలకు 20కి పైగా మంకీ బైట్స్ నమోదు అవుతున్నాయి. కోతి దాడి చేసిన 48 గంటల్లో చికిత్స పొందాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ఉంటుంది. కోతులతో రేబీస్ లాంటి వింత లక్షణాలు ఉంటాయి.
– సత్యనారాయణ, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్
ప్రత్యేక బృందాలను రప్పిస్తాం
కోతులు పట్టే ప్రత్యేక బృందం ఒక్కటే ఉంది. దసరా పండుగకు స్వగ్రామం వెళ్లారు. పది రోజుల్లో వస్తాం అన్నారు. ప్రత్యేక బృందం సభ్యులు వచ్చిన వెంటనే కోతులను పట్టిస్తాం. కోతుల బెడద తీవ్రంగా ఉందన్న విషయం నా దృష్టికి వచ్చింది.
– మారుతిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ చెన్నూర్


