మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందుతున్నాయి. అదే విద్యార్థులు హాస్టళ్లలో ఉంటుండడంతో అల్పాహారం, మధ్యాహ్న భోజనం బిల్లులు క్లెయిమ్ చేస్తుండడంతో ప్రభుత్వ ధనం వృథా అవుతోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ ప్రీమెట్రిక్ హాస్టళ్ల మెస్‌చార్జీలపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులకు హాస్టల్ మెస్‌చార్జీలను రాత్రి భోజనానికే పరిమితం చేయాలని పేర్కొంది. పాఠశాలల పథకాలకు, హాస్టల్ మెస్‌చార్జీలకు డబుల్ బిల్లులు రాకుండా ఖర్చులను నియంత్రించాలని సూచించింది. అల్పాహారం, భోజనం అమలవుతున్న పాఠశాలల్లో చదువుతూ ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులను విద్యాశాఖ అధికారుల సమన్వయంతో గుర్తించాలని డిప్యూటీ డైరెక్టర్లు, డీఎస్‌సీడీవోలను ఆదేశించారు.
మెస్‌చార్జీలపై స్పష్టత ఏది..?
జిల్లాలో 17 ఎస్సీ ప్రీమెట్రిక్ హాస్టళ్లలో 1,289మంది, 8 పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో 1,005మంది విద్యార్థులు ఉన్నారు. ఎస్సీ ప్రీమెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు రోజుకు రూ.50చొప్పున నెలకు రూ.1,500 ప్రభుత్వం డైట్‌చార్జీలు చెల్లిస్తుంది. మూడు నుంచి 10వ తరగతి వరకు పాఠశాల స్థాయి వసతిగృహంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం పాఠశాలలో భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ అమలు చేస్తున్నారు. ఆదివారం, రెండో శనివారం, ఇతర సెలవు రోజుల్లో మధ్యాహ్న భోజనం వసతిగృహంలో అందిస్తున్నారు. వారానికి ఐదుసార్లు పండ్లు, ఐదుసార్లు కోడిగుడ్లు, రెండుసార్లు చికెన్ కర్రీతో భోజనం వడ్డిస్తున్నారు. పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందుతున్న విద్యార్థులకు హాస్టల్ మెస్‌చార్జీలను రాత్రి భోజనానికే పరి మితం చేయాలనే ఉత్తర్వుల జారీతో గందరగోళం నెలకొంది. వారంతపు సెలవులు, విద్యార్థి అనారో గ్యం కారణంగా బడికి వెళ్లకుండా హాస్టల్‌లోనే ఉన్న రోజుల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం బిల్లులు ఎలా క్లెయిమ్ చేయాలనే దానిపై మార్గదర్శకాల్లో లేకపోవడంతో వార్డెన్లను అయోమయానికి గురి చేస్తోంది. ఉదయం 7గంటలకు రాగిజావ, పాలు, అరటిపండు అందిస్తున్నారు. సాయంత్రం బిస్కెట్ ప్యాకెట్, శనగ మొలకలు, పల్లిపట్టి, నువ్వుల చిక్కి, సేమియా, బబ్బెర్లుపై స్పష్టత లేదు.
ఎస్సీ ప్రీమెట్రిక్ హాస్టళ్లకేనా..!
ఎస్సీ అభివృద్ధి శాఖ సర్క్యులర్ కేవలం స్కూల్ బ్రేక్‌ఫాస్ట్, మిడ్‌డే మీల్స్ పథకాలు అమలు అవుతున్న పాఠశాలల్లో చదివే ప్రీ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకే పరిమితం అవుతుందా..? పోస్టుమెట్రిక్ విద్యార్థులకు వర్తిస్తుందా అనేది తెలియడం లేదు. కళాశాలల్లోనూ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అమల్లోకి వచ్చింది. ఆ విద్యార్థులకు హాస్టల్ మెస్‌చార్జీలపై సర్క్యులర్‌లో స్పష్టత లేదు. భవిష్యత్‌లో ప్రీమెట్రిక్(బీసీ, ఎస్టీ), పోస్టుమెట్రిక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు కూడా ఇదే తరహా నిబంధనలు వర్తింపజేస్తారా అనే చర్చ సాగుతోంది.
సెంట్రల్ కిచెన్ ద్వారా
రాత్రి భోజనం అందిస్తే..
సెంట్రల్ కిచెన్ ద్వారా పాఠశాలలకు బ్రేక్‌ఫాస్ట్, కళాశాలలకు అల్పాహారం, లంచ్ అందిస్తున్నట్లే హాస్టళ్లలో రాత్రి భోజనం అందించే ఏర్పాట్లు చేస్తే విద్యార్థులకు ఎంతో సౌకర్యంగా నాణ్యమైన పోషకాహారం అందుతుంది. హాస్టళ్లలో వంట నిర్వహణ భారం, సిబ్బంది సమస్యలు తొలగిపోతాయి. ఆహారాన్ని నాణ్యత ప్రమాణాలతో సరఫరా చేయడం సులభం అవుతుంది.


