మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ నిబంధనల ప్రకారం చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్‌లో జీవో 59, 76 అమలుపై జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, సింగరేణి భూముల క్రమబద్ధీకరణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జీవో నం.59 ప్రకారం 500 చదరపు గజాల్లో విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణల క్రమబద్ధీకరణకు నిబంధనలు, అర్హతలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. జీవో నం.76కు సంబంధించి తహసీల్దార్లు, సింగరేణి అధికారులు సమన్వయంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగించాలని, సింగరేణి ఉద్యోగులు కాని వారు క్వార్టర్లలో నివాసం ఉంటే ఖాళీ చేయించాలని తెలిపారు.


