● రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
చెన్నూర్: చెన్నూర్‌లో గోదావరి పుష్కరాలకు రూ.70 కోట్ల నిధులతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.5.50 కోట్ల నిధులతో అంబేడ్కర్ జంక్షన్ నుంచి పెద్ద చెరువు రావిచెట్టు వరకు రోడ్డు విస్తరణ, రూ.70 కోట్లతో మహంకాళి వాడ నుంచి జాతీయ రహదారి వరకు, నేషనల్ హైవే నుంచి పుష్కర ఘాట్ వరకు రోడ్డు విస్తరణ, హైమాస్ లైట్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా మార్నింగ్ వాక్ చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా పనులు చేపడుతామన్నారు. చెన్నూర్ ప్రాంతానికి ప్రాచీన చరిత్ర ఉండడంతో లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. నిర్ణీత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ వినయ్‌కుమార్, కౌన్సిలర్లు సుంకరి శిరీష, అంబటి శంకర్, తదితరులు పాల్గొన్నారు.


