కేజీబీవీలకు సరఫరా ఎప్పుడో..?
కారం, పసుపు, చింతపండు పంపిణీ ఎప్పుడో
పెసరపప్పుకు బదులు పెసళ్లు
ఆశీర్వాద్ పోయి.. కొత్త పేర్లతో సరుకులు
మంచిర్యాలఅర్బన్: దసరా సెలవులు ముగియడంతో విద్యార్థులు గురుకులాలు, సంక్షేమ వసతిగృహాల బాట పడుతున్నారు. నాకాఫ్ ద్వారా సరుకులు అరకొరగా అందుతుండడంతో ఇబ్బందులు తప్పేలా లేవు. హాస్టల్, గురుకుల విద్యాలయాలకు ఇండెంట్ ప్రకారం నిత్యావసర సరుకులు సరఫరా చేయాల్సి ఉన్నా అరకొరగా చేసి దులిపేసుకుంటున్నారు. దీంతో ప్రత్యేక అధికారులు బయట అప్పులు చేసి, సొంత డబ్బులతో కొనుగోలు చేయాల్సి వస్తోంది. కస్తూర్బా, యూఆర్‌ఎస్‌లకు సెప్టెంబర్ ఒకటిలోగా సరుకులు సరఫరా చేయాల్సి ఉండగా ఇంకా రాలేదు. మరోవైపు సరుకుల నాణ్యత, సరఫరా విధానం వివాదాస్పదంగా మారింది. గతంలో జిల్లా స్థాయిలో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మార్కెట్‌లో లభించే ఆశీర్వాద్, స్వస్తిక్ వంటి బ్రాండెడ్ సరుకులు సరఫరా చేయగా.. ప్రస్తుతం ఎన్నడూ వినని, తెలియని కొత్త కంపెనీల సరుకులు పంపిణీ చేస్తుండడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో సేకరించిన ఉత్పత్తులు గిరి నేచర్ బ్రాండ్ పేరుతో కారం, సాంబర్ పొడి ఇతరత్రా కొన్ని అందిస్తుండడం ఊరటనిస్తోంది. జిల్లాలో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ 9, ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్‌ఎస్ 8, టీఎస్‌టీఎంఆర్‌ఈఐఎస్‌లు 1, కేజీబీవీ 8, యూఆర్‌ఎస్ 1, బీసీ వసతిగృహాలు 18, ఎస్సీ వసతిగృహాలు 25, ఎస్టీ ఆశ్రమ, పోస్టుమెట్రిక్ హాస్టళ్లు 17, టీజీఎంఎస్ హాస్టళ్లు 4 ఉన్నాయి. గతంలో జిల్లా స్థాయిలో టెండర్లు పిలిచి సరుకులు పంపిణీ చేసేవారు. కొత్తగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రొక్యూర్‌మెంటు, ప్రాసెసింగ్ అండ్ రిటైలింగ్ కో ఆపరేటివ్స్ ఆఫ్ ఇండియా(నాకాఫ్) సంస్థ సరుకుల పంపిణీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంక్షేమ వసతిగృహాలు, గురుకుల విద్యాలయాలకు సరుకుల కష్టాలు తప్పడం లేదు.
పప్పులకు బదులు పెసళ్లు..
మినపప్పులో పుచ్చులు
నాకాఫ్ సంస్థ సరఫరా చేస్తున్న సరుకుల పంపిణీ గందరగోళంగా మారింది. సరకుల బ్రాండ్లు మారడమే కాకుండా పంపిణీ సరళిలో మార్పులు ఇక్కట్లు తెచ్చి పెడుతున్నాయి. నిత్యం వంటల్లో వాడే మినపప్పు, పుచ్చుళ్లుతో పంపించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పెసరపప్పుకు బదులుగా సాధారణ పెసళ్లు పంపిణీపై పెదవి విరస్తున్నారు. కొన్ని గురుకులాలు, హాస్టళ్లకు కారం, పసుపు, చింతపండు సరఫరాపై కాంట్రాక్టర్ నోరు మెదపడం లేదు. 30 రకాలు సరుకులకు బదులు 13, 14 సరకులతో సరి పెడుతున్నారు. జీలకర్ర, ధనియాలు, ఎండు మిర్చి, ఇడ్లీరవ్వ, ఆవాలు, వేరుశెనగ పప్పు వంటి సరుకులు చేరలేదు. నాకాఫ్ నుంచి ప్రాథమిక సరుకులు కూడా రావడం లేదు. సొంత డబ్బులు పెట్టి బయట కొందామన్న పాత బిల్లులు రాక అప్పు పుట్టడం లేదని, కాంట్రాక్టర్లు స్టాక్ వస్తుందనే చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఇబ్బందులపై వసతిగృహ, గురుకులాల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో సరుకులు పంపిణీ, పర్యవేక్షణ, నిత్యావసరాల సరుకుల నాణ్యతపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి మోనూ సమర్థవంతగా అమలు జరిగేలా చూస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది.


