మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ 15 పీజీ సీట్లకు దరఖాస్తు
మొదటి విడత కౌన్సెలింగ్‌కు రాని అనుమతులు
రెండో విడతపై ఆశలు
ఎన్‌ఎంసీ సభ్యుల తనిఖీలు పూర్తి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఈ ఏడాది 15 మెడికల్ పీజీ సీట్ల కేటాయింపుపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎంబీబీఎస్‌లో వంద సీట్లతో సొంత భవనంలో కళాశాల నిర్వహిస్తుండగా.. అనుబంధంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నూతన భవనం 450 పడకలతో రెండు నెలల్లో అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పీజీ సీట్లు కేటాయించాలని గత ఏడాది జాతీయ మెడికల్ కౌన్సిల్(ఎంఎన్‌సీ)ను అనుమతి కోరారు. ఈ ఏడాది నుంచే పీజీ సీట్లు కేటాయించి మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే విద్యార్థులు చేరుతారని అంతా భావించారు. కానీ అనుమతి రాకపోగా మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి కావొస్తోంది. రెండో విడతకు ముందుగానే పీజీ సీట్లకు అనుమతి లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పీజీ మెడికల్ విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు మంచిర్యాల కళాశాలలో ఏర్పాటు చేస్తున్నారు. నూతన ఆస్పత్రి భవనం పూర్తయితే అన్ని విభాగాల వైద్య సేవలు, శస్త్రచికిత్సలు అందుబాటులోకి వస్తాయి. వైద్య విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సీట్ల కేటాయింపుపై గత నెలలోనే ఎంఎన్‌సీ బృందం మంచిర్యాల ఆస్పత్రి, కళాశాలను తనిఖీ చేసింది. రాష్ట్రంలోని కొన్ని కళాశాలల్లో పీజీ సీట్ల కేటాయింపుపై ఎంఎన్‌సీ బృందం తనిఖీ చేయగా, మొదటి విడతలో ఏ ఒక్క కాలేజీకి సీట్లు కేటాయించలేదు. దీంతో రెండో విడతలో సీట్లు కేటాయిస్తారని భావిస్తున్నారు.
మూడు విభాగాలు..
మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మూడు విభాగాల్లో ఐదు పీజీ సీట్ల చొప్పున 15 సీట్లు కేటాయించాలని కళాశాల ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేసింది. అందులో జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, గైనకాలజీ విభాగాలున్నాయి. ఆయా విభాగాల్లో సరిపడా నిపుణులు అందుబాటులో ఉండడంతోపాటు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మాతాశిశు ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు మెరుగ్గా అందుతున్నాయని ఎన్‌ఎంసీ బృందం తనిఖీల్లో గుర్తించింది. నూతన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి భవనం అందుబాటులోకి వస్తే మిగతా విభాగాల్లోనూ వైద్య సేవలు మెరుగుపడే అవకాశం ఉంది. మెడికల్ కాలేజీ నూతన భవనం కావడంతో అన్ని రకాల మౌలిక సదుపాయాలు నిబంధనల మేరకు ఉన్నాయి. తరగతి గదులు, సరిపడా ల్యాబ్‌లు, వైద్య విద్యార్థులకు సరిపడేలా భవన నిర్మాణం, హాస్టల్ వసతి వంటివి ఉండడం కలిసొచ్చే అంశం. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని 15 పీజీ సీట్లను ఈ ఏడాది పీజీ విద్యార్థులకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూతన భవనంలో అధునాతనమైన వైద్య పరికరాలు అమర్చేలా, ఆయా విభాగాల్లో అన్ని రకాల వైద్య సేవలు, శస్త్రచి కిత్సలు జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో నెల రోజుల్లో రెండో విడత కౌన్సెలింగ్ ఉండనుండగా, ఆలోపు అనుమతులు వస్తాయని భావిస్తున్నారు.
అనుమతి కోసం చూస్తున్నాం
మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వంద సీట్ల చొప్పున ప్రతీ ఏడాది ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తున్నారు. ఈ ఏడాది నుంచి పీజీ సీట్లు 15 కేటాయించాలని గతేడాది అనుమతి కోరుతూ ఎన్‌ఎంసీకి రాశాం. గత నెలలో ఎన్‌ఎంసీ బృందం కళాశాల, అనుబంధ ఆసుపత్రులను తనీఖీ చేసింది. ప్రస్తుతానికి అనుమతులు రాలేదు. రెండో విడత పీజీ కౌన్సెలింగ్ వరకు అనుమతులు వస్తాయని అనుకుంటున్నాం.
– డాక్టర్ దేవోజి మాలోతు, మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్


