బెల్లంపల్లి: భూ రీ–సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండలంలోని చాకపల్లి గ్రామంలో భూ రీ–సర్వే పనులను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూ రికార్డుల ప్రక్షాళన, సర్వే ప్రక్రియ అమలు, పనుల్లో పారదర్శకత, కచ్చితత్వం పాటించాలని అన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా భూ రీ–సర్వే ప్రక్రియను సమర్థవంతంగా, నిర్ధేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ రీ–సర్వే పనుల పురోగతి, భూభారతి పథకం కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, తాండూర్ మండల తహసీల్దార్ జ్యోత్స్న పాల్గొన్నారు.
పత్తి మద్దతు ధర పొందాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): కపాస్ కిసాన్ యాప్ ద్వారా మార్కెటింగ్ వివరాలు తెలుసుకుని పత్తికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పొందాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా సాగుభూమి సంరక్షణ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గుడిపేట రైతు వేదికలో కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, మార్కెట్ కమిటీ చైర్మన్ బానేశ్, ఆత్మ చైర్మన్ మురళీ, రైతు ఉత్పత్తిదారుల సంఘం డైరైక్టర్లు పూస్కూరి శ్రీనివాసరావు, బొడ్డు శంకర్, బొలిశెట్టి తిరుపతి, రైతులు పాల్గొన్నారు.


