బెల్లంపల్లి: బెల్లంపల్లిలో దుర్గాదేవి నవరాత్రి వేడుకులు, శోభాయాత్ర వైభవంగా నిర్వహించి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు. బాబుక్యాంపు బస్తీ వాసవీ పంచాయతన క్షేత్రంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవ కమిటీ, ఆర్యవైశ్య సంఘం, వాసవీ సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ నెల 21న దుర్గాదేవి శోభాయాత్రను 500 మంది కోలాటం మహిళా కళాకారులు, 40 మంది ఒగ్గు కళాకారులు, 20 మంది చిరుతల రామాయణం కళాకారులు, పదుల సంఖ్యలో భజన కళాకారులతో పుర వీధుల మీదుగా నిర్వహించి ఆకట్టుకున్నారు. అంతకు ముందు 1,008 మహిళలతో కుంకుమ పూజ చేశారు. దీంతో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఎం.రామ్‌ప్రకాష్, సభ్యురాలు సుగుణ గురువారం రాత్రి స్థానికంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసి ఆర్యవైశ్య సంఘం, ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సర్టిఫికేట్ అందజేశారు. దుర్గాదేవి వేడుకలకు ప్రాధాన్యత దక్కడంపై ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నల్మాస్ సంతోష్ హర్షం వ్యక్తం చేశారు.


