చెన్నూర్: చెన్నూర్ పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాలయం, పద్మశాలి భవనం, పాత బస్టాండ్, కొత్తగూడెం కొండపోచమ్మ, బట్టిగూడెం లక్ష్మీదేవర ఆలయాల వద్ద సద్దుల బతుకమ్మ వేడుక కన్నుల పండుగగా సాగింది. పట్టణంలో అనాదిగా ఏడు రోజుల్లోనే వేపకాయ బతుకమ్మ రోజున బ్రాహ్మణ, పద్మశాలి, ముదిరాజ్ కులాల మహిళలు సద్దుల బతుకమ్మ నిమజ్జనం చేయ డం ఆనవాయితీగా వస్తోంది. వివిధ కులాల సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం నిర్వహించనున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బతుకమ్మ ఘాట్ వద్ద లైటింగ్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ, కమిషనర్ మారుతిప్రసాద్ తెలిపారు.
మంచిర్యాలఅగ్రికల్చర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు ప్రతీక బతుకమ్మ అని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాల్లో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, వివిధ శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలోనే ఉందన్నారు. ఈ వేడుకల్లో మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చెన్నూర్లో బతుకమ్మ ఆడేందుకు కూతుళ్లతో కలిసి వచ్చిన తల్లి


