సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎల్నినో కరువు ఘంటికలు మోగిస్తున్న వేళ నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వానాకాలంలో జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాగా.. నీటి వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సి ఉంది. జిల్లాలో చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టుల ఆధారంగా సాగు ఆశాజనకంగా లేదు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే యాసంగి ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఇప్పటికే వ్యవసాయ అధికారులు ఆరుతడి పంటలు మాత్రమే వేయాలంటూ సూచిస్తున్నారు. రైతులకు సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. వానాకాలంలో జిల్లాలో 3.23 ఎకరాల్లో సాగు కాగా.. ఇందులో 1.72లక్షల ఎకరాల్లో పత్తి, 1.46లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరి పొట్ట దశలో ఉండగా, పత్తి పూత నుంచి కాత దశకు చేరుకుంది. ఎండలు మండిపోతున్న తరుణంలో నీటి లభ్యత వేగంగా పడిపోయే అవకాశాలున్నాయి.
లోతుకు పడిపోతున్న జలాలు
జిల్లాలో భూగర్భ జలాలు గత రెండు నెలల వ్యవధిలోనే ఒక మీటర్ కన్నా లోతులోకి పడిపోయాయి. దీంతో వచ్చే వేసవి నాటికి మరింత తగ్గుదల కనిపించే అవకాశం ఉంది. నస్పూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో వేగంగా భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఇదే తీరుగా కొనసాగితే నీటి లభ్యత తగ్గే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు చెరువుల్లోనూ నీటి లభ్యత తగ్గుదల కనిపిస్తోంది. సాగు అవసరాలకు సరిపడా లేకపోతే యాసంగిలో చెరువుల కింద ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారనుంది. జిల్లాలో ఉన్న మధ్య తరహా ప్రాజెక్టులైన ర్యాలీ, గొల్లవాగు, నీల్వాయిలో నీటి లభ్యత అందుబాటులో ఉంది. ర్యాలీ ప్రాజెక్టులో పూడిక తీత పేరుకుపోవడంతో సగానికే నీటిని నిల్వ చేస్తున్నారు.
వేసవిలో నీటి కరువు..
జిల్లాలో కరువు పరిస్థితులు ఎదుర్కోవాలంటే నీటి వనరులను పొదుపుగా వాడుకుంటేనే మేలని అధికారులు సూచిస్తున్నారు. గోదావరిలోనూ నీటి లభ్యత తగ్గితే తాగునీటికి ఇబ్బంది ఏర్పడనుంది. ఇప్పటికే అధికారులు కేవలం తాగునీటి కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిని విడుదల చేస్తున్నారు. వరి సాగయ్యే చోట కూడా ఆరుతడి వైపు మళ్లితే భూగర్భ జలాల వినియోగం తగ్గనుంది. అలాగే వచ్చే వేసవిలో నీటి కరువును ఎదుర్కొనే అవకాశం ఉంది.
గొల్లవాగు ప్రాజెక్ట్


