ఒక్కో చోట.. ఒక్కో కార్యాలయం | - | Sakshi
Sakshi News home page

ఒక్కో చోట.. ఒక్కో కార్యాలయం

Oct 17 2026 6:42 AM | Updated on Oct 17 2026 6:42 AM

సింగరేణి కంపెనీ క్వార్టర్లలో ప్రభుత్వ కార్యాలయాలు

ఇరుకు గదులతో ఉద్యోగులు, ప్రజల ఇబ్బందులు

విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం

బెల్లంపల్లి: రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన బెల్లంపల్లిలో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఊసే లేకుండా పోయింది. ఏళ్ల తరబడి నుంచి సింగరేణి కంపెనీకి చెందిన పాత, శిథిలావస్థకు చేరిన క్వార్టర్లలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తుండడంతో ఉద్యోగులు, సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించడంలో పాలకులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం(సబ్‌ కలెక్టర్‌) మొదలుకుని వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు(ఏడీఏ), ఐసీడీఎస్‌, డివిజనల్‌ పంచాయతీ(డీఎల్‌పీవో), ఆర్‌డబ్ల్యూఎస్‌, తహసీల్దార్‌, ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌, మెప్మా తదితర ప్రభుత్వ విభాగాల కార్యాలయాలకు పక్కా భవనాలు లేవు. ఆర్‌అండ్‌బీ డీఈఈ, గృహ నిర్మాణ శాఖ డీఈ, ప్రజారోగ్య శాఖ డీఈ కార్యాలయాలు మంజూరు చేయించడంతోపాటు ప్రత్యేకంగా ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌ నిర్మించాల్సి ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌ భవనం శిథిలం కాగా స్థలం అన్యాక్రాతం అవుతోంది. ఆ పక్కనే పాత తహసీల్దార్‌ కార్యాలయం భవనం పనికి రాకుండా ఉంది. ఈ స్థలంపై అక్రమార్కులు కన్నేసినట్లు తెలుస్తోంది.

అసౌకర్యాలు..

సింగరేణి క్వార్టర్లు పాతవి కావడంతో సరైన వసతులు లేవు. ఇరుకు గదులతో నెట్టుకొస్తున్నారు. సబ్‌ కలెక్టర్‌, తహసీల్‌ కార్యాలయాల భవనాలు శిథిలా వస్థకు చేరాయి. తహసీల్‌ కార్యాలయంలో పలు గదుల్లో పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. దీంతో విధి నిర్వహణకు ఉద్యోగులు భయపడుతున్నారు. ఐసీడీఎస్‌, ఏడీఏ కార్యాలయాలూ అదే తీరుగా ఉన్నాయి. ఎకై ్సజ్‌ కార్యాలయం దశాబ్దాల క్రితం నుంచి అద్దె భవనంలో కొనసాగుతోంది. సిబ్బందికి సరిపడా గదులు లేకున్నా నెట్టుకొస్తున్నా రు. ఎకై ్సజ్‌ కార్యాలయ భవనానికి మూడేళ్ల క్రితం నిధులు మంజూరైనా నిర్మాణానికి నోచుకోలేదు.

ప్రభుత్వ స్థలాల కబ్జా

బెల్లంపల్లిలో ప్రభుత్వ స్థలాల కబ్జా యథేచ్ఛగా సాగుతోంది. సర్వేనంబర్‌ 170లోని ప్రభుత్వ భూ ములు ఇప్పటికే కబ్జా అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణానికి స్థలం దొరికే పరిస్థితులు కనిపించడం లేదు. ఖాళీ స్థలాలు పరాధీనం అవుతున్నా ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోంది. దీంతో అక్రమార్కులు రాజకీయ అండదండలతో భూ కబ్జాకు పాల్పడుతున్నారు.

ప్రభుత్వ స్థలాలు కాపాడాలి

ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రభుత్వ ఖాళీ స్థలాలు కబ్జా అవుతున్నాయి. వీటిని పరిరక్షించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి. భవిష్యత్‌లో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మాణానికి స్థల సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలి. ఈపాటికే దురాక్రమణ జరిగిన ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలి.

– దుబాసి వెంకటస్వామి, బెల్లంపల్లి

అధికారులు చర్యలు తీసుకోవాలి

బెల్లంపల్లిలో ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణాలకు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి. వేర్వేరుగా కాకుండా ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్నీ కూడా ఒకే సముదాయంలో నిర్మాణం చేయాలి. అలా అయితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఒకే భవన సముదాయంలో పనులు చక్కబెట్టుకోవడానికి వీలవుతుంది.

– ఎండీ.ఓజీయార్‌, బెల్లంపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement