దసరాకు గుడుంబా జోష్‌! | - | Sakshi
Sakshi News home page

దసరాకు గుడుంబా జోష్‌!

Oct 17 2026 6:42 AM | Updated on Oct 17 2026 6:42 AM

● సరిహద్దు అటవీ ప్రాంతాల్లో తయారీ ● మహారాష్ట్ర, మంచిర్యాల నుంచి ముడి సరుకు ● అధికారుల మొక్కుబడి దాడులు

మంచిర్యాలక్రైం: జిల్లాలోని గ్రామీణ అటవీ, సరిహద్దు ప్రాంతాల్లో గుడుంబా తయారీ యథేచ్ఛగా సాగుతోంది. దసరా నేపథ్యంలో అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని అవసరమైన ముడిసరుకు బెల్లం, యూరియా, పటిక అడవుల్లోకి ఎడ్లబండ్లపై ముందుగానే తరలించినట్లు తెలిసింది. గుడుంబా, నాటుసారా తయారీకి అడ్డుకట్ట వేయాల్సిన కొందరు ఎకై ్సజ్‌శాఖ అధికారుల కనుసన్నల్లోనే తయారీ, విక్రయాలు సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చెన్నూర్‌, హాజీపూర్‌ మండలంలోని అటవీ ప్రాంతాలు, సిర్సా, అన్నారం, నీల్వాయి, కోటపల్లి, బ్రహ్మణపల్లి, అర్జునగుట్ట, నెన్నెల మండలంలోని అటవీ ప్రాంతాల్లో బట్టీలు ఏర్పాటు చేసుకుని సారా తయారీ చేస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి వందల లీటర్ల సారా గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలకు తరలిస్తున్నారు. ఆయా గ్రామాల్లో పశువుల కాపర్లు అటవీ ప్రాంతానికి వెళ్లేందుకు భయపడుతున్నారు. సారా బట్టీలు ఉండే ప్రదేశాలకు వెళ్లే పశువుల కాపరులను సారా తయారీదారులు బెదిరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని గ్రామాల శివారులో కాపాలాదారులు అధికారులు, ఇతరులు ఎవరైనా వస్తే సెల్‌ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వడంతో తయారీదారులు తప్పించుకుంటున్నారు.

అటవీ ప్రాంతంలో మకాం

దసరా పండుగ నేపథ్యంలో గుడుంబా వ్యాపారులు గుడుంబా తయారీకి అడవుల్లో రోజుల తరబడి మకాం వేస్తున్నారు. ముడిసరుకు, అవసరమైన ఆహారపదార్థాలు కుండలు, క్యాన్లలో మంచిర్యాల, మహారాష్ట్రలోని సిరోంచ మీదుగా తయారీదారుల వద్దకు తీసుకెళ్తున్నారు. నీటి వసతి ఉన్న చోట సారాబట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత క్యాన్లలో నింపి పల్లెలు, పట్టణాలకు తరలిస్తున్నా రు. సారా తయారీకి కొందరు వ్యాపారులు రోజు వారీ కూలీలను వినియోగిస్తున్నట్లు సమాచారం. ముడిసరుకు చేరవేత, సారా తయారీ అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో విక్రయదారులకు అప్పగించేందుకు భోజనంతోపాటు రోజు కూలి రూ.300 నుంచి రూ.500 చెల్లిస్తున్నారని సమాచారం. సంబంధిత శాఖలోని కొందరు తయారీదారుల నుంచి ప్రతీ నెల మామూళ్లు తీసుకుంటూ ఉన్నతాధికారుల కదలికలు, దాడులపై సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరినప్పుడు మొక్కుబడిగా దాడులు నిర్వహించి బెల్లం పానకం, సారా స్వాధీనం చేసుకుని తయారీదారులపై నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి.

జిల్లాలో ఈ ఏడాది ఎకై ్సజ్‌ శాఖ అధికారుల

దాడులు, నమోదు చేసిన కేసులు

గుడుంబా స్థావరాలపై దాడులు 753

స్వాధీనం చేసుకున్న బెల్లం పానకం 2,529 లీటర్లు

స్వాధీనం చేసుకున్న బెల్లం 3,860 కిలోలు

స్వాధీనం చేసుకున్న పటిక 687 కిలోలు

బెల్టుషాపుల దాడుల్లో కేసులు 173

అరెస్టు 175

స్వాధీనం చేసుకున్న లిక్కర్‌ 1,390.28లీటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement