జన్నారం: వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి నరేందర్రాథోడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బందితో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండి సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతీరోజు ఒక గది శుభ్రం చేయాలని సూచించారు. ఆసుపత్రి ఆవరణ చుట్టూ మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు. 30ఏళ్లు పైబడిన వారందరికీ బీపీ, షుగర్ పరీక్షలు చేసి సరైన సమయంలో మందులు అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో వైద్యురాలు ఉమాశ్రీ, సూపర్వైజర్లు, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.


