మంచిర్యాలటౌన్: జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి చిరువ్యాపారాలు సాగిస్తున్న పలువురు వీధి వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైనే కూర్చుని విక్రయిస్తున్నారు. మున్సిపాలిటీ తరఫున వీధి విక్రయదారుల షెడ్లు నిర్మించినా, వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. ఐదేళ్ల్ల క్రితం రూ.22లక్షల మున్సిపల్ నిధులతో ఐబీ చౌరస్తాలో, పాతమంచిర్యాల వాటర్ ట్యాంక్ ప్రహరీ వద్ద, ప్రభుత్వ ఐటీఐ ప్రహరీని ఆనుకుని వీధి విక్రయదారుల షెడ్లు నిర్మించారు. రూ.7.50 లక్షలతో ఐబీ చౌరస్తాలోని ఐబీ ప్రహరీని ఆనుకుని 25 దుకాణాలు, ప్రభుత్వ ఐటీఐ ప్రహరీని ఆనుకుని 15 షాపులు, పాతమంచిర్యాలలోని నీటి ట్యాంక్ ప్రహరీ వద్ద 15 షాపులు వచ్చేలా రూ.22 లక్షలతో నిర్మాణాలు చేపట్టారు. వీటి నిర్మాణం పూర్తయి ఐదేళ్లయినా ఇప్పటికీ నిరుపయోగంగానే ఉంచడంతో అవి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి.
తప్పని ట్రాఫిక్ ఇబ్బందులు
జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి నిత్యం పండ్లు, కూరగా యలు, పూలు, మక్క కంకులు, వివిధ రకాల సరుకులు, వస్తువులు, తోపుడు బండ్లు, గంపల్లో పెట్టుకుని వీధి వ్యా పారులు ఎండ, వాన తేడా లేకుండా రోడ్లపైనే నిత్యం అ మ్మకాలు జరుపుతున్నారు. ఓవైపు ఎండ, వానకు ఇబ్బందులు పడుతుంటే, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా వారిని ఒకచోట నుంచి మరో చోటకు పోలీసులు తరలించడంతో ఇబ్బందుల మధ్య వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వర్షం పడితే పక్కనే తలదాచుకుంటూ తగ్గిన తర్వాత మళ్లీ రోడ్లపైకి వచ్చి అమ్ముకుని వెళ్తున్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వీధి వ్యాపారుల కోసం నిర్మించిన షెడ్లు ఎవరికీ కే టాయించక పోవడం, ఆ దిశగా కనీస ప్రయత్నాలు కూడా చేయకపోవడంతో రాత్రి సమయాల్లో అవి మందుబాబుల కు అడ్డాలుగా మారుతున్నాయి. వీధి వ్యాపారులందరికీ షె డ్లు ఇవ్వడం సాధ్యం కాకపోయినా, కొన్ని ప్రాంతాల్లోని వా రికి ఇవి అందించి, వారు రోడ్లపై ఇబ్బందులు పడకుండా చూసే అవకాశముంది. ఈ షెడ్లను అవసరమైన వారికి అందించి, రోడ్లపైన క్రయవిక్రయాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ము న్సిపల్ అధికారులదే. కానీ, రోడ్లపైనే విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. వీధి వ్యాపారులు షెడ్లలోకి వెళ్తే మాత్రం జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తీరేందుకు అవకాశముంది. ముఖ్యమైన కూడలిగా ఉన్న ఐబీ చౌరస్తాలో నిత్యం ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఇక్కడ షెడ్లున్నా, వీధి వ్యాపారులు రోడ్లపైనే కూర్చుని అమ్మకాలు చేస్తున్నారు. పట్టణ ప్రగతి, సుందరీకరణలో భాగంగా నిర్మించిన షెడ్ల కోసం ఖర్చు చేసిన నిధులు వృథా అవుతుండగా, షెడ్లు వినియోగంలో లేకపోవడంతో అవి శిథిలావస్థకు చేరి, మందుబాబులకు అడ్డాగా మారే అవకాశముంది.
వ్యాపారులు ఆసక్తి చూపించకనే..
వీధి వ్యాపారులు రోడ్లపై విక్రయాలు జరపకుండా ఉండేందుకు మూడుచోట్ల షెడ్లు నిర్మించగా, వీధి వ్యాపారులు వీటిలోకి రావడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో అవి నిరుపయోగమయ్యాయి. షెడ్లను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.
– అన్వేశ్, మంచిర్యాల నగర కమిషనర్


