మంచిర్యాలఅర్బన్: కార్పొరేట్ కోచింగ్‌లకు దీటుగా గురుకులాల్లో పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ సొసైటీ పరిధిలో కళాశాలల్లో విద్యార్థులకు ఎప్ సెట్ ప్రత్యేక ఉచిత శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. పోటీ పరీక్షల శిక్షణ కేవలం సీఓఈ విద్యాసంస్థలకే పరిమితం కాగా ఇకపై నాన్ సీఓఈ సైన్స్ కళాశాలలకు విస్తరించారు. సబ్జెక్టు నిపుణుల ద్వారా వర్చువల్ (ఆన్‌లైన్) విధానంలో తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని గురుకుల విద్యార్థులకు ఎప్‌సెట్‌కు నాణ్యమైన శిక్షణ అందుబాటులోకి రావడంతో ప్రయోజనం చేకూరనుంది.
సబ్జెక్టు నిపుణల బోధన
సీఈవో విద్యార్థులతోపాటు సాధారణ(నాన్–సీవోఈ) గురుకుల విద్యార్థులకు కూడా అనుభవజ్ఞులైన నిపుణులతో డిజిటల్ విధానంలో పాఠాలు వినే అవకాశం లభిస్తుంది. ఎంసెట్, ఎప్‌సెట్ విధానం, ప్రశ్నల సరళి, టైమ్ మేనేజ్‌మెంట్, షార్ట్‌కట్ ట్రిక్స్‌పై స్పష్టత వస్తుంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, వృత్తి విద్య కోర్సుల్లో ఉత్తమ ర్యాంకు సాధించి మంచి కళాశాలల్లో సీటు పొందే అవకాశాలు మెరుగుకానున్నాయి.
సోషల్ వెల్పేర్‌లో..
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో విద్యార్థులకు గురువారం ఆన్‌లైన్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఎనిమిది కళాశాలల్లో చెన్నూర్, కోటపల్లి, జైపూర్, మందమర్రి, మంచిర్యాల, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, బెల్లంపల్లి సీఈఈ కళాశాలలున్నాయి. ప్రతీ సెక్షన్‌లో 40 మంది చొప్పున 640 మందికి శిక్షణతో ప్రయోజనం చేకూరనుంది.


