మంచిర్యాలఅగ్రికల్చర్: ఉపాధ్యాయుల కృషి, అంకితభావంతోనే విద్యార్థుల భవిష్యత్‌కు బలమైన పునాది ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదులో ఉపాధ్యాయుల కృషితో ముందంజలో ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నూతన విద్యావిధానాలు, సాంకేతికతను నేర్చుకుంటూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. 27మంది ఉత్తమ ఉపాధ్యాయులు, జిల్లా స్థాయిలో ఉత్తమ ఎన్‌రోల్‌మెంటు సాధించిన 20 పాఠశాలల హెచ్‌ఎంలకు అవార్డులు అందజేశారు. అధిక సంఖ్యలో స్కాలర్‌షిప్‌లు సాధించిన ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌సీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 3పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు. అనంతరం విద్యార్థులు నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, నగర మేయర్ ధర్ని మధుకర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, సంక్షేమ శాఖ అధికారులు రౌఫ్‌ఖా న్, రాజేశ్వరి, కార్పొరేటర్ హరికృష్ణ పాల్గొన్నారు.


