ఇచ్చోడ: మండలంలోని గాంధీనగర్ శివారులో గల పత్తి చేనులో గంజాయి సాగు చేస్తున్న మామిడిగూడ గ్రామానికి చెందిన యెర్మ మారుతిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్ రమేశ్ తెలిపారు. సీఐ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలి పారు. వీటి విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందన్నారు. అనంతరం మారుతి వ్యవసాయ షెడ్డులో తనిఖీలు నిర్వహించగా 67 గ్రాముల ఎండిన గంజాయితో పాటు అక్కడే దాచి పెట్టిన ఎలుగుబంటి గోరు లభ్యమైనట్లు తెలిపారు. అటవీప్రాంతంలో చనిపోయిన ఎలుగుబంటిని గుర్తించి దాని గోరును నిందితుడు దాచిపెట్టాడన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ సాగుతో పాటుగా వన్యప్రాణుల చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.


