భీమారం: మండల కేంద్రం సమీపంలోని గొల్లవాగు ప్రాజెక్ట్‌లో చెన్నూర్‌కు చెందిన సంబోగుల నితిన్ (30) మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్ట్ కట్ట మీదుగా వెళ్లే వారికి జలాశయంలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిబ్బందితో కలిసి ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి పరిశీలించగా ప్యాంట్, షర్ట్ లేని వ్యక్తి మృతదేహం నీళ్లపై తేలియాడుతూ కనిపించింది. మృతదేహాన్ని బయటకు తీసి మృతుడి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా చెన్నూర్ పట్టణంలోని పద్మానగర్‌కు చెందిన నితిన్‌గా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదని, కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.


