అమ్మ ఆకాంక్ష మేరకు ఐఏఎస్‌ | - | Sakshi
Sakshi News home page

అమ్మ ఆకాంక్ష మేరకు ఐఏఎస్‌

Sep 11 2026 11:54 PM | Updated on Sep 11 2026 11:54 PM

ఏజెన్సీలో తొలి పోస్టింగ్‌ గొప్ప అవకాశం ఓటమితో ఆగిపోకుండా శ్రమిస్తేనే విజయం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఉట్నూర్‌ సబ్‌కలెక్టర్‌ ప్రణయ్‌కుమార్‌

సాక్షి: మీ స్వస్థలం ఏది? విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది.?

సబ్‌కలెక్టర్‌: నా స్వస్థలం జనగామ జిల్లాలోని రఘునాథపల్లి. 2021లో జేఎన్‌టీయూ నుంచి బీటెక్‌ పూర్తి చేశాను. యూపీఎస్సీ కోసం 2022లో మొదటి ప్రయత్నం చేశాను. రెండో ప్రయత్నంలో 2023లో సివిల్స్‌ సాధించాను.

సాక్షి: మీ కుటుంబ నేపథ్యం ఏమిటి.?

సబ్‌కలెక్టర్‌: మా తండ్రి ఓ ఎన్‌జీవోకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ మహిళా సాధికారతపై పనిచేశారు. అమ్మ గృహిణి. నలుగురిలో నేను చిన్నవాడిని.

సాక్షి: సివిల్స్‌ ఎందుకు ఎంచుకున్నారు.?

సబ్‌కలెక్టర్‌: సమాజానికి ప్రత్యక్షంగా సేవ చేయాలనే అమ్మ తపనే నన్ను సివిల్స్‌ వైపు నడిపించింది. బీటెక్‌ పూర్తయిన తర్వాత తీవ్రంగా శ్రమించి 2023లో రెండో ప్రయత్నంలో ఐఏఎస్‌ సాధించా.

సాక్షి: ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు.?

సబ్‌కలెక్టర్‌: ఖాళీ సమయం దొరికినప్పుడు నేను ప్రముఖుల బయోగ్రఫీలు (జీవిత చరిత్రలు), సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల పుస్తకాలు, అంబేడ్కర్‌, గాంధీ పుస్తకాలను ఎక్కువగా చదువుతాను. నాకు కబడ్డీ, ఫుట్‌బాల్‌, బ్యాట్మింటన్‌ క్రీడలు చాలా ఇష్టం. నా చిన్నతనం నుంచే కబడ్డీ బాగా ఆడేవాడిని. నేను ఒక కబడ్డీ ప్లేయర్‌ను.

సాక్షి: ఏజెన్సీ ప్రాంతంలో తొలి పోస్టింగ్‌ చేపట్టడంపై మీ స్పందన ఏమిటి.?

సబ్‌కలెక్టర్‌: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు ఇది సరైన వేదిక. ఐటీడీఏ పీవో, కలెక్టర్‌, అధికారుల సహకారంతో పని చేస్తా. గిరిజనుల వద్దకు ప్రభుత్వ సేవలు నేరుగా, వేగవంతంగా చేరేలా నిరంతరం పర్యవేక్షిస్తా. ఏజెన్సీ ప్రాంతంలో అటవీ, భూ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించా. సమస్యలను ఒక్కొక్కటిగా సమీక్షించి, పరిష్కరించడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తా.

సాక్షి: సివిల్స్‌కు సిద్ధమవుతున్న యువతకు, విద్యార్థులకు మీరిచ్చే సలహా ఏమిటి.?

సబ్‌కలెక్టర్‌: ఓర్పు, నిలకడైన శ్రమ, స్పష్టమైన ప్రణాళిక ఉంటే సివిల్స్‌ సాధించడం అసాధ్యం కాదు. పరీక్షలో ఓటమి ఎదురైతే నిరాశపడకుండా, అధైర్యపడకుండా నిరంతరం ప్రయత్నించాలి. పుస్తకాలతో కాకుండా సమాజంలో జరుగుతున్న మార్పులపై నేరుగా పర్యవేక్షిస్తే పూర్తి స్థాయిలో అవగాహన కలిగే ఆస్కారం ఉంటుంది. ఓటమిని మరిచి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తే విజయం సాధ్యమవుతుంది.

సాక్షి: ఉట్నూర్‌ ప్రజలకు ఏం చెప్తారు..?

సబ్‌ కలెక్టర్‌: ఉట్నూర్‌ ప్రాంత, ప్రజా సమస్యల పరిష్కారానికి తోడ్పడుతాను. ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పాలన పారదర్శకంగా అందిస్తా. ఏ సమస్య ఉన్న నేరుగా నన్ను సంప్రదిస్తే పరిష్కారానికి నావంతు కృషి చేస్తా.

ఉట్నూర్‌రూరల్‌: ‘నేను ఐఏఎస్‌ కావాలన్నది అమ్మ కోరిక.. అమ్మ ఆకాంక్ష నెరవేర్చాలని కష్టపడి చదివి ఐఏఎస్‌ సాఽధించా’నని యువ ఐఏఎస్‌, ఉట్నూర్‌ సబ్‌కలెక్టర్‌ కొయ్యడ ప్రణయ్‌కుమార్‌ అన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన ఉట్నూర్‌లో తొలి పోస్టింగ్‌ రావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానని, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, గిరిజనుల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేస్తానన్నారు. తన విద్య, కుటుంబ నేపథ్యంతో పాటు తదితర అంశాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement