త్వరలో వంద పడకల ఆస్పత్రి షురూ.. ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అక్కడికే.. మాతాశిశు ఆరోగ్య కేంద్రంగా మారిస్తేనే కొనసాగింపు..
చెన్నూర్: చెన్నూర్ పట్టణంలో వంద పడకల ఆస్పత్రి ప్రారంభానికి సన్నద్ధమవుతోంది. చె న్నూర్, కోటపల్లి, వేమనపల్లి, భీమారం మండలాల ప్రజలకు మెరుగైన వైద్యం అందనుంది. ఫలితంగా ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది. మరోవైపు ఏరియా ఆస్పత్రి మూత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చె న్నూర్ ఏరియా ఆస్పత్రిలో 18మంది వైద్యులతోపాటు సూపరింటెండెంట్, సరిపడా సిబ్బంది ఉన్నారు. వీరంతా వంద పడకల ఆస్పత్రి జీవో ప్రకారం చెన్నూర్ ఏరియా ఆస్పత్రిలో వి ధులు నిర్వర్తిస్తున్నారు. త్వరలో వంద పడకల ఆస్పత్రి ప్రారంభమైతే వైద్యులు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏరియా ఆస్పత్రి మూతపడే అవకాశం ఉంది. అయితే మాతాశిశు ఆస్పత్రి(ఎంసీహెచ్)గా మారిస్తే పిల్లలు, గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందే అవకాశం ఉందని ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపించారు. వంద పడకల ఆస్పత్రి ప్రారంభంలోగా ఎంసీహెచ్ ఏర్పాటు కోసం జీవో విడుదలైతే ఆస్పత్రిలో యధావిధిగా మాతాశిశువులకు వైద్యసేవలందే అవకాశం ఉంది. నేషనల్ హెల్త్ స్కీం ద్వారా ప్రత్యేక జాబ్ ప్యాటర్న్ ఉంటుంది. ఎంసీహెచ్‌కు కావాల్సిన వైద్యులు, సిబ్బందిని సమకూరుస్తారు.
ప్రతిపాదనలు పంపించాం..
వంద పడకల ఆసుపత్రి జాబ్ ప్యాటర్న్ అక్కడికి వెళ్లిపోతుంది. ఎంసీహెచ్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించాం. మంత్రి వివేక్ కృషి చేస్తున్నారు. జీవో వచ్చే అవకాశం ఉంది. జీవో వస్తే ఎంసీహెచ్‌లో యాధావిధిగా సేవలందుతాయి. జీవో అలస్యం అయితే ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరిస్తాం.
– సత్యనారాయణ, ఏరియా
ఆసుపత్రి సూపరింటెండెంట్, చెన్నూర్
మంత్రి వివేక్ ప్రయత్నాలు
ఏరియా ఆస్పత్రిని మాతాశిశు ఆస్పత్రిగా ఏర్పాటు చేసేందుకు జీవో కోసం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి కృషి చేస్తున్నట్లు తెలిసింది. వంద పడకల ఆస్పత్రి ప్రారంభానికి ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ హాజరు కానున్నట్లు ఇటీవల మంత్రి ప్రకటించారు. వైద్యారోగ్య శాఖ మంత్రితో మాట్లాడి జీవో జారీ చేయించే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.


