బృహత్‌ వికృతి వనం | - | Sakshi
Sakshi News home page

బృహత్‌ వికృతి వనం

Sep 11 2026 11:15 AM | Updated on Sep 11 2026 11:15 AM

బెల్లంపల్లి: బెల్లంపల్లి ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీలో బృహత్‌ పట్టణ ప్రకృతి వనం నిర్వహణ లేక వికృతంగా తయారైంది. పర్యవేక్షణ కొరవడి పనికిరాకుండా పోతోంది. ప్రకృతి వనం నిర్మాణానికి వెచ్చించిన ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరైంది. తుమ్మ ఇతర రకాల పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి అధ్వానంగా మారింది. గోల్‌ బంగ్లా బస్తీ శివారులో ఐదెకరాల విస్తీర్ణంలో బృహత్‌ ప్రకృతి వనం ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజల ఆహ్లాదం కోసం అన్ని విధాల అభివృద్ధి చేయాల్సి ఉన్నా బల్దియా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బెంచ్‌లు మందుబాబులు, ఆకతాయిలకు అడ్డాగా మారాయి. రేయింబవళ్లు మందుబాబులు, గంజాయి రాయుళ్లు బెంచ్‌లు, చెట్ల నీడపట్టున దర్జాగా గంటల తరబడి కూర్చోని మత్తులో జోగుతున్నారు. చీకటి పడితే చాలు వనంలో అసాంఘిక కార్యకలాపాలు నిత్యకృత్యంగా మారాయని సమీప ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రకృతి వనంలో మొక్కలు నీటితడులు అందించడానికి ప్రత్యేకంగా బోరు ఏర్పాటు చేసి విద్యుత్‌ సౌకర్యం కల్పించారు. కరెంటు సరఫరాకు ఆటంకం కలుగకుండా ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేశారు. ఇవన్నీ వినియోగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. బృహత్‌ వనం నిర్వహణకు ఏటా నిధులు కేటాయించాల్సి ఉన్నా పట్టింపు కరువైంది. 10శాతం గ్రీన్‌ బడ్జెట్‌ సమకూర్చాల్సి ఉన్నా నిర్లక్ష్యం చేస్తూ బృహత్‌వనాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు బృహత్‌ ప్రకృతి వనం అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం

బృహత్‌ ప్రకృతి వనం నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. సిబ్బంది సమస్య వల్ల నిర్వహణ చేపట్టడం లేదు. ఇకపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బృహత్‌ వనాన్ని అన్ని విధాల అభివృద్ధికి కృషి చేస్తాం. వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నాం.

– తన్నీరు రమేష్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, బెల్లంపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement