కోటపల్లి: అంగన్‌వాడీ కేంద్రంలో సరుకులు పక్కదారి పట్టించేందుకు టీచర్ తప్పుడు రికార్డులు నమోదు చేసింది. బాలికలకు పెళ్లయినట్లు, గర్భిణీ, తల్లిగా నమోదు చేయడం విచారణలో వెల్లడి కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మండలంలోని నక్కలపల్లి–1 అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్ వీ.సరోజ అవకతవకలకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సంధ్య గురువారం అంగన్‌వాడీ కేంద్రంలో విచారణ చేపట్టగా అక్రమాలు వెలుగు చూశాయి. కేంద్రంలో ఆరేళ్లలోపు పిల్ల లు 19మంది, ఇద్దరు బాలింతలు, నలుగురు గర్భిణులు ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. వీరిలో ఇద్దరు బాలికలకు పెళ్లయినట్లు, బాలింతలుగా నమోదు చేసి సరుకులు పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. రికార్డుల్లో నమోదైన వారిని పిలిచి విచారణ చేసి లిఖిత పూర్వకంగా సేకరించారు. లబ్ధిదారుల పేర్లపై సరుకులు తీసుకున్నట్లు చూపించి పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, మండలంలోని బద్దదంపల్లి అంగన్‌వాడీ కేంద్రం రికార్డుల్లోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీటెక్ విద్యార్థిని పెళ్లయినట్లు నమోదు చేసినట్లు తెలిసింది. వీరు చెన్నూర్‌లో ఉంటుండడం గమనార్హం. ఈ విషయం అధికారులకు తెలిసి నిలదీయడంతో ఇటీవల తొలగించినట్లు సమాచారం.


