బెల్లంపల్లి: ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. నెన్నెల మండలం మైలారం గ్రామ శివారులోని వాగులో నుంచి ఇసుక తరలిపోతోంది. కొందరు ట్రాక్టర్ల నిర్వాహకులు రాత్రికి రాత్రే వాగులో నుంచి గొల్లపల్లి, జోగాపూర్, చిత్తాపూర్, ఆవుడం గ్రామాల మీదుగా మందమర్రికి, నెన్నెల మండలంలోని పలు గ్రామాలకు రవాణా చేస్తున్నారు. దూరాన్ని బట్టి ఒక్కో ట్రిప్పు ఇసుకకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. అక్రమ రవాణా నియంత్రణకు నెన్నెల టీ రోడ్డు వద్ద రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో చెక్‌పోస్టు ఏర్పాటుతో అక్రమార్కులు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. గొల్లపల్లి, జోగాపూర్ మీదుగా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. రాత్రివేళ దందా సాగుతుండడంతో రెవెన్యూ, పోలీసు శాఖలు అడ్డుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అక్రమార్కులకు ఓ శాఖ సిబ్బంది లోపాయికారిగా సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారుల రాకను దందా నిర్వాహకులకు చేరవేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో అక్రమార్కులు ఇసుక రవాణాకు విరామం ఇస్తున్నారు. కాగా, రెండ్రోజుల క్రితం ఓ ఇసుక ట్రాక్టర్‌ను అధికారులు చాకచక్యంగా పట్టుకున్నట్లు సమాచారం.
చర్యలు తీసుకుంటాం
ఇసుక దందాను నిరోధానికి చర్యలు తీసుకుంటున్నాం. ఏ ప్రాంతం నుంచి రవాణా అవుతున్నా సమాచారం అందగానే ట్రాక్టర్లను పట్టుకుంటున్నాం. తాజాగా జన్కాపూర్ వద్ద రెండు ట్రాక్టర్లు పట్టుకున్నాం. నెన్నెల మండలంలో ఇసుక దందా నివారణకు రెవెన్యూ, పోలీసు శాఖల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాం.
– జగన్‌మోహన్, మైనింగ్ ఏడీ, మంచిర్యాల


