సర్కార్‌.. వైద్యుల్లేరు! | - | Sakshi
Sakshi News home page

సర్కార్‌.. వైద్యుల్లేరు!

Sep 8 2026 11:53 PM | Updated on Sep 8 2026 11:53 PM

● జైపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్‌ ఫార్మసిస్టు లేకపోవడంతో నస్పూర్‌ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన రమేశ్‌ ఇక్కడ మూడు రోజులు, నస్పూర్‌లో మూడు రోజులు విధులు నిర్వర్తిస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో అందని వైద్యం జీజీహెచ్‌లో 98 మంది ప్రొఫెసర్‌, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ఖాళీలు స్కానింగ్‌ వైద్యులూ లేరు ఆర్థో శస్త్రచికిత్సలకే పరిమితం కంటి సమస్యలు ఓపీతోనే సరి.. నాలుగేళ్లుగా కంటి శస్త్రచికిత్సలు బంద్‌

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)లో వైద్యులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో రోగులకు పూర్తి స్థా యిలో వైద్యసేవలు అందని పరిస్థితులు నెలకొ న్నాయి. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా కొనసాగుతున్న ఆస్పత్రిలో 13మంది ప్రొఫెస ర్లు, 36మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 49మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 20మంది ట్యూటర్లు అవసరం ఉంది. ఇందులో రేడియాలజీ వైద్యులు 6, ఫిజియాలజీ 6, బయోకెమిస్ట్రి 2, ఫోరెన్సిక్‌ 5, మైక్రో బయాలజీ 3, పీడియాట్రిక్స్‌ 6, జనరల్‌ సర్జరీ 11, అనస్థీషియా 9, ఈఎన్‌టీ 2, గైనకాలజీ 9, పాథాలజీ 2, సైకియాట్రీ 2, మైక్రో బయాలజీ 3 ఇలా పలు కీలకమైన విభాగాల్లోనే ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. కార్డియాలజిస్టు వైద్యులు లేక గుండె సంబంధిత 2డీ ఎకో స్కానింగ్‌తోపా టు గుండె జబ్బులకు చికిత్స అందడం లేదు. వైద్యులు, సిబ్బంది పోస్టుల ఖాళీతో ఆయా విభాగాల వైద్య సేవలపై ప్రభావం చూపిస్తోంది. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలతోపాటు మహారాష్ట్రకు చెందిన రోగులు వైద్యం కోసం ఆస్పత్రికి వస్తుంటారు. పలు విభాగాల్లో వైద్య సేవలు అందక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవే టు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. రేడియాలజిస్టులు లేకపోవడంతో జీజీహెచ్‌, మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులు, గర్భిణులకు స్కానింగ్‌ ఇబ్బందిగా మారుతోంది. రేడియాలజిస్టు ప్రొఫెసర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఒకరు ఉండగా, తాత్కాలికంగా ఆ వైద్యురాలితోనే స్కానింగ్‌ సేవలు కొనసాగిస్తున్నారు. ఎక్స్‌రే చేసేందుకు సైతం టెక్నీషియన్‌ మీదే ఆధారపడడంతో ఆయా సేవలకు రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. జీజీహెచ్‌ భవనం శిథిలావస్థకు చేరడంతో ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఆర్థో శస్త్రచికిత్సలు మాత్రమే చేస్తున్నారు. పంటి వైద్యం, కంటి శస్త్రచికిత్సలు, ఇతరత్రా శస్త్రచికిత్సలు చేయడం లేదు.

నస్పూర్‌లో..

నస్పూర్‌: నస్పూర్‌ పీహెచ్‌సీకి ప్రతీరోజు 75 నుంచి 90 మంది వరకు ఔట్‌ పేషెంట్లు వస్తారు. సి బ్బంది లేక చికిత్సలో జాప్యం జరుగుతోంది. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్‌ చేస్తున్నారు. ఫార్మసిస్టు, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ లేకపోవడం ఇబ్బందులకు గురి చేస్తోంది. పీహెచ్‌సీ పరిధిలో 11 సబ్‌ సెంటర్లు ఉండగా అందులో ఏడింటిలో మాత్రమే ఎంఎల్‌హెచ్‌పీ వైద్యులు సేవలు అందిస్తున్నారు. 22 మంది ఏఎన్‌ఎంలు ఉండాల్సి ఉండగా 16 మంది మాత్రమే ఉన్నారు. బీపీ 20ఎంజీ మాత్రలు అందుబాటులో లేక ఇబ్బందిగా మారుతోంది.

లక్సెట్టిపేటలో..

లక్సెట్టిపేట: పట్టణంలోని ఆసుపత్రిలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రతీ రోజు 300 మంది ఓపీకి వస్తుండగా, వైద్యులు పూర్తి స్థాయిలో లేక ఇబ్బందులు పడుతున్నారు. 11 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా ఇద్దరే విధులు నిర్వహిస్తున్నారు. గైనకాలజిస్టు, పిడియాట్రిషియన్‌, సర్జన్‌, జనరల్‌ సర్జన్‌, నలుగురు డ్యూటీ డాక్టర్లు, పల్మనాలజిస్టు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

కిక్కిరిసిన ఆస్పత్రులు

చెన్నూర్‌/జైపూర్‌: చెన్నూర్‌ ఏరియా ఆస్పత్రిలో మంగళవారం ఉదయం 11గంటల కు ఓపీ వద్ద రోగులు కిక్కిరి సి ఉన్నారు. జ్వరాలు, తలనొప్పి, జలుబు, గొంతునొ ప్పితో బాధపడే రోగులే అధికంగా ఉన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఎక్కడ చూసినా రోగులు, వారి సహాయకులే కనిపించారు. వైద్యులు ప్రతాప్‌గౌడ్‌, అశోక్‌ రోగులను పరీక్షించి మందులు రాసిచ్చారు. జనరల్‌ వార్డుల్లో జ్వర బాధితులు చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నామని, సైలెన్‌ బాటిళ్లు ఎక్కిస్తున్నారని, ఆస్పత్రిలోనే మందులు ఇచ్చారని కొండంపేట గ్రామానికి చెందిన మల్లయ్య తెలిపాడు. ఆస్పత్రిలో 18మంది వైద్యులు ఉన్నారని, అన్ని రకాల మందుగోలీలు, పరికరాలు అందుబాటులో ఉన్నాయని, రోగులకు మెరుగైన సేవలందిస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సత్యనారాయణ తెలిపారు.

మందమర్రిరూరల్‌: మందమర్రిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మధుమేహా వ్యాధిగ్రస్తుల ఇన్సూలిన్‌, ఇంజక్షన్లు అసలే లేవు. వైద్య సిబ్బందిని అడిగితే జిల్లా ఆసుపత్రికి ఇండెంట్‌ పంపించినా సరఫరా కాలేదని సమాధానం చెబుతున్నారు. దీంతో రోగులు డబ్బులు వెచ్చించి బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రమాదాలు, డెలివరి కేసులను జిల్లా ఆసుపత్రికి రెఫర్‌ చేస్తున్నారు.

నిధుల ఊసేలేదు..

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): హాజీపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ది కమిటీ లేక మూడేళ్లకు పైగా నిధుల మంజూరు లేదు. ఈ ఏడాది కాయకల్ప పథకం కింద జిల్లాలోని పలు మండల, అర్బన్‌ పీహెచ్‌సీలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు విడుదల కాగా హాజీపూర్‌కు మంజూరు కాలేదు. ఆస్పత్రి భవనం పాతది కావడంతో వైరింగ్‌, ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు తరచూ కాలిపోతున్నాయి. ఆపరేషన్‌ థియేటర్‌ విద్యుత్‌ వైరింగ్‌ కాలిపోగా ఏసీ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఆస్పత్రి ఓటీ గది స్టోర్‌ రూమ్‌గా మారింది. ఏడాదికిపైగా ఫార్మసిస్ట్‌ కొరతతో పారామెడికల్‌ సిబ్బంది మందులు అందిస్తున్నారు. ఇండెంట్‌ ప్రకారం మందుల సరఫరా లేకపోగా బీపీ మాత్రల కొరత ఆరు నెలలుగా ఉంది.

దండేపల్లిలో..

దండేపల్లి: దండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు సుమారు 50 నుంచి వంద మంది వరకు రోగులు వస్తుంటారు. రెగ్యులర్‌ డాక్టర్లు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇద్దరు వైద్యులకు గాను ఒకరిని కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన నియమించారు. మరో డాక్టర్‌ పోస్టు ఖాళీగానే ఉంది. రెండు అటెండర్‌ పోస్టులు ఖాళీ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement