ప్రసవ వేదన..! | - | Sakshi
Sakshi News home page

ప్రసవ వేదన..!

Sep 8 2026 11:53 PM | Updated on Sep 8 2026 11:53 PM

బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడంతో ప్రసవాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. వంద పడకల ఆస్పత్రిలో నలుగురు గైనకాలజిస్టులు ఉండాల్సి ఉండగా ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో రోజువారీగా 10వరకు ప్రసవాలు జరగాల్సి ఉండగా.. ఒకటే ప్రసవంతో సరిపెట్టాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. గైనకాలజిస్టు, మత్తు డాక్టర్లు, సిబ్బంది కొరత కారణంగా నెలకు అతికష్టంగా 30 నుంచి 35 వరకు ప్రసవాలు చేస్తున్నారు. గర్భిణులు, ఎమర్జెన్సీ కేసులు అత్యధికంగా మంచిర్యాల మాతాశిశు ఆస్పత్రికి రెఫర్‌ చేస్తున్నారు. కొందరు గర్భిణులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. గర్భిణుల సంఖ్యకు అనుగుణంగా ప్రసవాల సంఖ్య పెంచడానికి మరో ముగ్గురు గైనకాలజిస్టులతోపాటు మత్తు డాక్టర్లు ముగ్గురు, 20మంది వరకు సపోర్టింగ్‌ సిబ్బందిని నియమించాల్సి ఉన్నా తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోంది. ఆసుపత్రి స్థాయికి అనుగుణంగా డెప్యూటీ సివిల్‌ సర్జన్‌ పోస్టులు 10 భర్తీ చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు.

ఖాళీలు, డిప్యూటేషన్లతో సతమతం

తాండూర్‌: తాండూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీలు, సిబ్బంది డిప్యూటేషన్‌తో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. సీజనల్‌ వ్యాధులు ప్ర బలుతుండగా మెరుగైన సేవలు అందడం లేదు. ముగ్గురు వైద్యుల పోస్టులు భర్తీ కాగా ఇద్దరు డిప్యూటేషన్‌పై వేరే ఆస్పత్రుల్లో పని చేస్తున్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌, పీహెచ్‌ఎన్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్‌, ఆపీస్‌ సబార్డినేట్లు ఇద్దరు డిప్యూటేషన్‌పై వేరే చోట పని చేస్తున్నారు. సీనియర్‌ అసిస్టెంట్‌, పీహెచ్‌ఎన్‌ పోస్టులు, 5 ఏఎన్‌ఎం పోస్టులు, రెండు హెల్త్‌ అసిస్టెంట్‌, మూడు హెల్త్‌ సూపర్‌వైజర్‌, హెచ్‌ఈఓ పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయి. ఆసుపత్రికి నిత్యం వందమంది వరకు రోగులు వస్తున్నారు. బీపీ గోలీలైన టెల్మిసార్టన్‌ 20ఎంజీ, 40 ఎంజీ గోలీలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండడం లేదు. ఆర్థరైటిస్‌కు సంబంధించిన గోలీలు లేవు. ప్రతీ నెల ఇండెంట్‌ పంపిస్తున్నా కొంతమేర తగ్గించి సరఫరా అవుతున్నాయి.

మందుల కొరత..

కాసిపేట: కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మాసిస్ట్‌ లేక మందుల కొరత ఏర్పడుతోంది. వైద్యాధికారి డెప్యూటేషన్‌పై పని చేస్తుండగా, మొదటి ఏఎన్‌ఏంలు 3, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌(మెడికల్‌ ఆఫీసర్స్‌) 2, నర్సింగ్‌ ఆఫీసర్‌ 1, ఫా ర్మాసిస్ట్‌ 1 చొప్పున ఖాళీ ఉన్నాయి. బీపీ ట్యాబ్లె ట్లు టెల్మిసార్టన్‌ 40 ఎంజీ అందుబాటులో లేవు. పార్మాసిస్ట్‌ లేక ఇండెంట్‌ పంపినా సక్రమంగా అందుబాటులో లేవనే విమర్శలు ఉన్నాయి. రో జు వారీగా ఓపీ 90నుంచి 120వరకు ఉంటోంది.

సిబ్బంది కొరతే సమస్య..

నెన్నెల: నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన సిబ్బంది లేకపోవడంతో సేవలకు ఆటంకం కలుగుతోంది. ఉన్న ఉద్యోగులపై అదనపు పని భారం పడుతోంది. ప్రతీరోజు గ్రామాల నుంచి రోగులు వైద్యం కోసం వస్తుంటారు. మెడికల్‌ ఆఫీసర్‌, ఒక స్టాఫ్‌నర్సు, హెచ్‌ఈఓ, సూపర్‌వైజర్‌, రెండు ఎంఎల్‌హెచ్‌పీ, మూడు ఏఎన్‌ఎం పోస్టులు, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భీమిని పీహెచ్‌సీలో మెడికల్‌ ఆఫీసర్‌, స్టాఫ్‌నర్స్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

రెగ్యులర్‌ వైద్యుడు లేరు

వేమనపల్లి: వేమనపల్లి పీహెచ్‌సీకి డిప్యూటేషన్‌ వైద్యుడే దిక్కయ్యారు. వైద్యాధికారి, సిబ్బంది ఆలస్యంగా విధులకు హాజరై మూడు గంటల వరకు వెళ్లిపోతున్నారు. మంగళవారం 45మంది రోగులు వచ్చారు. ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముగ్గురు స్టాఫ్‌నర్స్‌లకు ఒక్కరే ఉన్నారు. ఐదు సబ్‌ సెంటర్లు ఉండగా రెండు ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది కొరత, సమయపాలన పాటించకపోవడంతో ప్రజలకు నమ్మకం పోతోంది. తీవ్ర జ్వరాలతో ఉన్న చాలామంది ప్రైవేట్‌ వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రసవాలు కూడా చాలా తగ్గుతున్నాయి. చెన్నూర్‌ సీహెచ్‌సీకి రెఫర్‌ చేస్తున్నారు.

మూడు గంటలు దాటితే ఉండరు

వేమనపల్లి దవఖానకు మూడు గంటల తర్వాత పోతే ఎవలు ఉంటలేరు. నాకు కాళ్లు, చేతులు గుంజుతానై, జ్వరం అత్తాందని ఆసుపత్రికి పోయిన గోలీలు ఇచ్చేటోళ్లు సుత లేరు అని అంటే వాపసు వెళ్లొచ్చిన. చేన్లల్లకు పనులకు పోయి అచ్చేటోళ్లం మాపటేళ్లకు దవాఖానలో సిబ్బంది ఉంటే మాకు కొంచెం వైద్యం అందుతది.

– తలండి బానయ్య, మంగనపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement