రామకృష్ణాపూర్: మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన రాజకీయ అసహనానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్ అన్నారు. వ్యక్తిగత విమర్శలు మానుకుని చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. బాల్క సుమన్ ఎంపీగా, ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు? ఎంతమంది యువతకు ఉద్యోగాలు కల్పించారు? సింగరేణి కార్మికుల కోసం ఏం సాధించారో వెల్లడించాలని ప్రశ్నించారు. ఏటీసీలు, టామ్‌కామ్, స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా యువతకు శిక్షణ అందించి ఉద్యోగావకాశాల కల్పనకు మంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. సమావేశంలో నాయకులు చందనగిరి శ్రీనివాస్, ఎర్రబెల్లి రాజేష్, శ్రీనివాస్, సతీష్ పాల్గొన్నారు.


