కాసిపేట: అక్షరాస్యతలో ముందున్న కాసిపేట మండలానికి ఢిల్లీ స్థాయిలో గుర్తింపు లభించింది. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వయోజన అక్షరాస్యత కార్యక్రమం అందుకు కారణమైంది. 2025లో తొలిసారిగా జిల్లాలోని కాసిపేట మండలంలో 100 రోజుల్లో వంద శాతం అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు. 22 గ్రామ పంచాయతీల పరిధిలో 15ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి అక్షరాలు నేర్పించారు. మండలంలో 3,462 మంది నిరక్షరాస్యులకు విద్య అందించేందుకు 233 మంది వాలంటరీలను నియమించారు. వీరితోపాటు 9, 10వ తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమానికి వాలంటీర్లు రాజేశ్వరి, రజిత, కవిత, అక్షరాస్యత సాధించిన భూమక్క, జ్యోతి, బోనమ్మ ఎంపికయ్యారు. వీరందరూ ఢిల్లీకి తరలివెళ్లారు.


