మంచిర్యాల ఆర్టీసీ ఆసుపత్రిలో కొరత
ఇబ్బందులు పడుతున్న కార్మిక కుటుంబాలు
మధుమేహం, నొప్పి గోలీలకు ఎదురుచూపులు
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాలలోని ఆర్టీసీ ఆస్పత్రిలో మందుగోలీల కొరత నెలకొంది. దీంతో మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని వందలాది మంది ఆర్టీసీ ఉద్యోగులతోపాటు విశ్రాంత సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వస్తోంది. షుగర్, ఇతరత్రా జబ్బుల బారిన పడిన కార్మికులు, వారి కుటుంబాలు మందులు లేకపోవడంతో బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రతీ నెల 8నుంచి 12వ తేదీ మధ్య మందుల కోసం ఇండెంట్ పంపిస్తున్నా అవసరమైన మేరకు రాకపోవడంతో తిప్పలు తప్పడం లేదు. రెండు జిల్లాలకు చెందిన 820మంది ఉద్యోగులతోపాటు రిటైర్డు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వైద్య సేవలు పొందుతుంటారు. ఏ చిన్న అనారోగ్యమైనా ఇక్కడికి వచ్చి చికిత్స పొంది మందులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆర్టీసీ డిస్పెన్సరీలో శాశ్వత వైద్యుడిని నియమించాల్సి ఉన్నా కాంట్రాక్టు పద్ధతిన వైద్యుడు, ఔట్‌సోర్సింగ్ స్టాఫ్‌నర్స్, ఫార్మాసిస్టు, ల్యాబ్, వార్డుబాయ్‌లు సేవలందిస్తున్నారు. దీంతో ఆస్పత్రి కాస్త కాంట్రాక్టు మయంగా మారింది.
నాలుగు నెలలుగా నిరాశే..
అనారోగ్యం పాలైన కార్మికులు మందుల కోసం వస్తే లేవనే సమాధానం నిరాశకు గురి చేస్తోంది. ముఖ్యమైన మందులు, రోగులు నిత్యం వాడే షుగర్ గోలీలు నాలుగు నెలలుగా అందుబాటులో లేవు. బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు శారీరక నొప్పులు సహజం. నొప్పి నివారణ మాత్రల కొరత ఏర్పడుతోంది. కీళ్లు, శరీర నొప్పుల కోసం వాడే గోలీలు రెండు నెలలుగా సరఫరా కావడం లేదు. జ్వరం గోలీలూ లేవు. ప్రతీ నెల 10నుంచి 20వ తేదీ వరకు వంద మందికి పైగా మందులు తీసుకెళ్తుంటారు. మిగతా రోజుల్లో 20 నుంచి 30మంది వస్తుండగా.. మందులు లేక సోమవారం ఒకరిద్దరు కూడా కనిపించలేదు. నెలకోసారి మందుల ఇండెంట్ పంపినా సరిపడా రావడం లేదని తెలుస్తోంది. కడుపులో మంట, ఎసిడిటీ నివారణ మాత్రలు స్వల్ప మొత్తంలోనే సరఫరా అవుతున్నాయని తెలిసింది. షుగర్, బీపీ గోలీలు రిటైర్డు కార్మికులకు రెండు నెలలు, ఆర్టీసీ ఉద్యోగులకు నెలకు సరిపడా ఇవ్వాల్సి ఉన్నా కొసరి కొసరి ఇస్తుండడంపై పెదవి విరుస్తున్నారు. నిరంతరం ప్రజారవాణాకు శ్రమించే ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది వైద్యం కోసం ప్రైవేట్ మందుల దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఉన్నతాధికారులు అత్యవసరమైన మందులు సరఫరా చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రిలో మందుల విషయమై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని, ప్రస్తుతం ఇండెంట్‌లో సరఫరాయ్యే మందులను రోగులకు ఇబ్బందులు లేకుండా పంపిణీ చేస్తామని ఆర్టీసీ వైద్యుడు తెలిపారు.


