సామర్థ్యాలు పెంచేలా.. | - | Sakshi
Sakshi News home page

సామర్థ్యాలు పెంచేలా..

Sep 7 2026 3:08 AM | Updated on Sep 7 2026 3:08 AM

● ప్రత్యేక ఎఫ్‌ఎల్‌ఎన్‌ సెల్‌ ● నలుగురు ఉపాధ్యాయులు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలకు అవకాశం ● ఈ నెల 9లోపు దరఖాస్తుల స్వీకరణ

మంచిర్యాలఅర్బన్‌: జిల్లా పరిధిలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ప్రాథమిక అభ్యసన సామర్థ్యాలు (ఎఫ్‌ఎల్‌ఎన్‌) అంచనా వేసేందుకు నిర్వహించిన పరీక్షకు 15,092 మందికి గానూ 14,262 మంది హాజరయ్యారు. బెస్‌లైన్‌ నివేదిక ప్రకారం రెండో తరగతిలో 3.7శాతం, మూడో తరగతిలో 6.8 శాతం, నాలుగో తరగతిలో 7.2 శాతం, ఐదో తరగతిలో 11.5 శాతం విద్యార్థులు మాత్రమే పూర్తి సామర్థ్యం సాధించినట్లు బెస్‌లైన్‌ అసెస్‌మెంట్‌ రిపోర్టు ఆందోళనకరంగా ఉందని స్పష్టమవుతోంది. 2 నుంచి ఐదో తరగతి విద్యార్థులకు మాతృభాష తెలుగు, ఇంగ్లిష్‌, గణితం, ఉర్ధూ భాషల్లో లోపాలు ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. మాతృభాష తెలుగులోనే విద్యార్థుల సామర్థ్యాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రాథమిక స్థాయిలోనే బలోపేతానికి..

ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులు చదవడం, రాయడం వంటి ప్రాథమిక అంశాల్లో వెనుకబడి పోవడం భవిష్యత్‌ విద్యపై త్రీవ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రాథమిక పఠనం, సంఖ్యాశాస్త్ర పునాదులను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, పర్యవేక్షించేందుకు ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పాఠశాలల సందర్శనల ద్వారా ఉపాధ్యాయులకు బోధనా పద్ధతుల్లో సహాయం చేయడం.. మార్గదర్శకత్వాలు అందించనున్నారు. తెలుగు, ఇంగ్లిష్‌, గణితం సబ్జెక్టుల్లో మెరుగైన బోధన పద్ధతులను అందుబాటులోకి తెచ్చి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచనున్నారు. విద్యా విషయక సమాచారాన్ని విశ్లేషించి జిల్లా స్థాయి నివేదికలు సిద్ధం చేయనున్నారు.

ఎఫ్‌ఎల్‌ఎన్‌ సెల్‌ ఏర్పాటు ఇలా..

పాఠశాలల్లో ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు, పర్యవేక్షణకు జిల్లా స్థాయి సెల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి చంద్రయ్య ప్రకటించారు. అర్హత, ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అకడమిక్‌ మెంటరింగ్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఉండి ఎఫ్‌ఎల్‌ఎన్‌ అమలు, ఉపాధ్యాయ శిక్షణలో అనుభవం ఉ న్నవారి ప్రాధాన్యత, మార్గదర్శకాలు వెల్లడించారు.

దరఖాస్తులు, ఎంపిక విధానం..

అర్హత కలిగిన ఉపాధ్యాయులు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు అవసరమైన వివరాలు ధృవీకరణ పత్రాలను ఈ నెల 9న సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నేరుగా సమర్పించాలి. అర్హత ఆధారంగా 1:2 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖాధికారులు , క్వాలిటీ కోఆర్డినేటర్లతో కూడిన ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేయనున్నారు.

ఖాళీలు, అర్హతలు..

ఎఫ్‌ఎల్‌ఎన్‌ సెల్‌ ఏర్పాటులో నాలుగు పోస్టులు భర్తీ చేయనున్నారు. తెలుగు, ఇంగ్లిష్‌, గణితం సబ్జెక్టు నిపుణులు 3, ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయుడు 1 పోస్టు భర్తీ చేయనున్నారు. ఎల్‌ఎఫ్‌ఎల్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే హెచ్‌ఎంలు 56 సంవత్సరాల వయస్సు మించకుండా ఎఫ్‌ఎల్‌ఎల్‌ హెచ్‌ఎంగా కనీసం 2 సంవత్సరాల పరిపాలనా అనుభవం ఉండాలని సూచించారు. సర్వీసు అనుభవం కనీసం 10 సంవత్సరాలు ఉండాలన్నారు. ఉపాధ్యాయుల పోస్టులు 56 సంవత్సరాలు మించకుండా 5 సంవత్సరాల బోధనా అనుభవం ఉండాలని పేర్కొన్నారు. క్లస్టర్‌, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో రిసోర్సు పర్సన్‌, ట్రైనర్‌గా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ బోధనా విధానాలపై అవగాహనతో పాటు ఎంఎస్‌ ఆఫీస్‌ పరిజ్ఞానం తప్పనిసరి చేశారు. పాఠశాల సందర్శించి మార్గదర్శకత్వం అందించే సామర్థ్యం (అకడమిక్‌ ప్యానెల్‌లో సభ్యుడిగా ఉండరాదు) ఉండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement