సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నిషేధ భూములపై రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు నిరసనలతో హోరెత్తిస్తున్నా యి. ఇటీవల ప్రభుత్వ, సీలింగ్, అసైన్డ్, భూదాన్, ఇనాం, సింగరేణి, సాగునీటి, దేవాదాయ, వక్ఫ్, తదితర భూముల్ని 1908 రిజిస్ట్రేషన్ చట్టం 22ఏ సెక్షన్ కింద వేలాది ఎకరాలు నిషేధిత జాబితాలో చేరాయి. దీంతో సింగరేణి పరిధిలో ఉన్న భూముల్లో ఉన్న నివాసాలు, అసైన్డ్, లావునీ భూములు, వ్యవసాయ, వ్యవసాయేతర భూములు సైతం నిషేధిత జాబితాలో ఉన్నాయి. దీంతో వేలాది ఇళ్ల స్థలాలు, ప్లాట్లు ఈ జాబితాలో ఉండడంతో ఏళ్లుగా నివాసం ఉంటున్న వారంతా హైరానా పడుతున్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మంచిర్యాల, గర్మిళ్ళ, నస్పూర్, శ్రీరాంపూర్ శివార్లలోనే పది వేల ఇళ్లు ఉన్నాయి. బెల్లంపల్లి, రామక్రిష్ణాపూర్ తదితర పట్టణాల్లోనూ ఉన్నాయి. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక మందికి గతంలో పట్టాలు ఉన్నవి సైతం నిషేధిత జాబితాలో చేరడంపై రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
విమర్శలు తిప్పికొడుతున్న ఎమ్మెల్యేలు
22ఏ జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలు, ఆరోపణలను స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రి వివేక్ తిప్పికొడుతున్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే ధరణి సమయంలో భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చారని సమాధానమిస్తున్నారు. పేదల భూములు, ప్రైవేటు ఆస్తులను చేర్చబోమని చెబుతున్నారు. వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ సర్కారు పనితీరుపై ప్రజల్లోకి పథకాలు తీసుకెళ్తుంటే మరోవైపు ప్రతిపక్షాలు చేస్తున్న కార్యక్రమాలతో హోరెత్తుతున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్షాలు 22ఏపై జిల్లాలో దుమారం రేపుతోంది.


