సర్దుబాటుకు గ్రహపాటు | - | Sakshi
Sakshi News home page

సర్దుబాటుకు గ్రహపాటు

Sep 6 2026 1:31 AM | Updated on Sep 6 2026 1:31 AM

● ఉత్తర్వులు సరే..ఉపాధ్యాయులేరీ.. ● పాత పాఠశాలల్లోనే టీచర్ల తిష్ట ● విద్యాశాఖ ఆదేశాలు బుట్టదాఖలు ● విద్యార్థుల చదువులపై ప్రభావం

మంచిర్యాలఅర్బన్‌: పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా విద్యాశాఖ సర్‌ప్లస్‌ (అదనపు) ఉపాధ్యాయులను గుర్తించి టీచర్లు అవసరం ఉన్న బడులకు వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ కింద ఆదేశాలు జారీ చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. పాత పాఠశాలల్లో పనిభారం తక్కువగా ఉండటంతో ఉపాధ్యాయులు తమ అనుకూల వాతావారణం (కంపోర్ట్‌జోన్‌) దాటి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. కొత్త ప్రాంతాలకు, దూరప్రాంత పాఠశాలలకు వెళ్లకుండా రకరకాల సాకులు చెబుతూ విధుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థుల అవసరాలను బట్టి సర్ధుబాటు చేస్తూ ఆర్డర్లు జారీ చేసినా ఉపాధ్యాయులు పాతబడులు వీడకపోవటం చర్చానీయాంశంగా మారింది.

పాత చోటే తిష్ట..

విద్యాశాఖ చేపట్టిన సర్దుబాటు ఉపాధ్యాయుల వైఖరితో విఫలమవుతోంది. జిల్లాలో 113 మందిని బదిలీ చేయగా తమ కంపోర్జ్‌ జోన్‌ వదిలి కేటాయించిన కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరింది దాదాపు 72 మంది టీచర్లు మాత్రమే. మందమర్రిలో ఎంఈవో తప్పిదం.. చెన్నూర్‌లో జూనియర్‌, సీనియర్‌ వివాదంతో రిలీవ్‌ పెండింగ్‌లో ఉంచారు. మిగిలిన టీచర్లు కొత్త ప్రాంతాలకు వెళ్లకుండా రకరకాల వంకలు చెబుతూ పాతబడుల్లోనే కాలయాపన చేస్తున్నారు. విద్యాశాఖ ఆర్డర్ల ప్రకారం కారణం ఏదైనా ఒకటి రెండు రోజుల్లోనే పాత బడుల్లో రిలీవ్‌ అయి కొత్త బడుల్లో చేరిన తర్వాత మళ్లీ పాత బడుల్లోకి రావటానికి అవకాశం ఉంటుందనేది టీచర్లకు తెలియంది కాదు. రోజులు గడుస్తున్నా విధుల్లో చేరని టీచర్లపై ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరిస్తుందా..? చర్యలు తీసుకుంటుందా? అనేది తెలియాల్సి ఉంది.

జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో సర్దుబాటు చేసే రోజుకు 55 మంది విద్యార్థులున్నారు. అదే మండలంలోని యూపీఎస్‌లో 103 మంది విద్యార్థులు ఉండగా మరో టీచరు అవసరంతో కొత్త పాఠశాలకు బదిలీ చేశారు. ఆ టీచర్‌ను వెనువెంటనే కాంప్లెక్స్‌ హెచ్‌ఎం రిలీవ్‌ చేయగా ఎంఈవో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కొత్త బడిలో చేరాల్సిన టీచర్‌ కంఫర్ట్‌గా లేదనుకుందో.. పాత బడుల్లో అడ్మిషన్లు పెరిగాయనో.. ఏదో ఒక సాకు చూపి పాత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ విద్యాశాఖ ఆదేశాలు బుట్టదాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement