మంచిర్యాలటౌన్: మంచిర్యాలలో గంజాయి బ్యాచ్‌లు యువతను గంజాయి, మందుకు బానిసగా చేస్తున్నారని, అలాంటి వారికి మద్దతు ఇచ్చేవారు వారి ఆలోచనను మార్చుకోవాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు హితవు పలికారు. యువతకు గంజాయి, మందు తాగించి పిల్లల జీవితాలను నాశనం చేసే వారిని క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన చేపట్టి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా శనివారం మంచిర్యాలలోని ఆయన నివాసం నుంచి ఐబీ చౌరస్తా వరకు మోటార్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూండాయిజం, రౌడీయిజంతో రాజకీయాలు చేయలేరని, అలాంటి వారికి మద్దుతు ఇచ్చేవారు ఆలోచన చేసుకోవాలని అన్నారు. ఇక్కడే పుట్టి పెరిగిన తాను ఈ ప్రాంత రుణం తీర్చుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఐదారుగురు పోయినంత మాత్రాన తనకు ఒరిగేదేమీ లేదని, ఉమ్మడి జిల్లాను కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా మార్చానని తెలిపారు. దండేపల్లి మండలం తాళ్లపేట్ నుంచి నస్పూర్‌లోని అరుణక్కనగర్ వరకు 22ఏపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మంచిర్యాల నియోజకవర్గంలో ఒక్క ఇళ్లు, ఒక్క ప్లాటు, గజం భూమి పోకుండా చూసే బాధ్యత తనదని, అవసరమైతే రాజీనామాకూ వెనుకాడనని తెలిపారు. వెయ్యి రోజుల పాలనలో గుడిపేటకు ఇంటర్నేషనల్ ఫిష్‌పాండ్, లక్సెట్టిపేట స్కూల్, కాలేజీ, ఆసుపత్రి నిర్మించి, లక్సెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలిచేలా చేశామని అన్నారు. అనంతరం సీసీసీ నస్పూరులోని రాజీవ్‌గాంధీ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేశ్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.


