సివిల్ సప్లయ్ గోదాం శిథిలం
లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని పౌరసరఫరాల సముదాయ గిడ్డంగి(సివిల్ సప్లయ్ గోదాం) శిథిలావస్థకు చేరింది. 1996లో అప్పటి నిల్వలకు అనుగుణంగా రూ.7లక్షల వ్యయంతో పోలీసుస్టేషన్ సమీపంలో గోదాం భవనాన్ని నిర్మించినా వినియోగంలో లేకుండా పోయింది. భవనం చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి మరుగునపడింది. ప్రస్తుతం మార్కెట్‌యార్డుకు చెందిన నాలుగు గోదాములను సివిల్ సప్లయ్ శాఖ అద్దెకు తీసుకుంది. వెయ్యి మెట్రిక్ టన్నుల గోదాంకు రూ.41వేలు, 600 మెట్రిక్ టన్నుల గోదాంకు రూ.21వేలు, 480 మెట్రిక్ టన్నుల గోదాములు రెండింటికి రూ.12,200 చొప్పున మొత్తంగా నెలకు రూ.74,200 అద్దె చెల్లిస్తోంది. ఈ గోదాముల్లో రేషన్ బియ్యం నిల్వ చేస్తూ ప్రతీ నెల లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాలకు సరఫరా చేస్తుంటారు. సివిల్ సప్లయ్ గోదాం కొంత స్థలంలో అమృత్ 2.0 వాటర్ ట్యాంకు నిర్మిస్తున్నారు. మరికొంత స్థలం గతంలో పట్టణ ప్రకృతి వనానికి కేటాయించారు.
నిల్వలకు ఇబ్బందులు
మార్కెట్‌యార్డుకు సంబంధించిన గోదాములు అద్దెకు ఇవ్వడంతో ధాన్యం నిల్వలకు గోదాములు కరువయ్యాయి. దీంతో ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యం నిల్వలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి పాత భవనాన్ని వినియోగంలోకి తేవాలని, నూతన గోదాముల నిర్మాణంపై దృష్టి సారించాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్కెట్ యార్డు గోదాములకు అద్దెకు ఇచ్చారని, సీజన్ సమయంలో ధాన్యం నిల్వలకు కేటాయిస్తే ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి సృజన్ తెలిపారు.


