రామకృష్ణాపూర్: కాంగ్రెస్‌ది దగా పాలన అని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనకు వెయ్యి రోజులు పూర్తయినా ఇచ్చిన హామీల్లో అనేకం అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. రామకృష్ణాపూర్‌లోని ఆర్‌కేసీవోఏ క్లబ్‌లో శుక్రవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నియోజకవర్గంలో హామీల అమలుపై మంత్రి వివేక్ వెంకటస్వామిని నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ గొడిసెల సంధ్యారాణి, నాయకులు సుదర్శన్‌గౌడ్, మేడిపెల్లి సంపత్, జాడి శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


