దండేపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును నిరసిస్తూ దండేపల్లి పద్మశాలీ భవన్ నుంచి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగడి బజారులో నిర్వహించిన రైతు సదస్సులో పార్టీ నాయకుడు విజిత్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారం చేపట్టి వెయ్యి రోజులైనా ఎన్నికలకు ముందు ప్రజలు, రైతులకు ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులు, ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ లింగన్న, మాజీ వైస్ ఎంపీపీ అనిల్, బీఆర్‌ఎస్ మండలాధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, సంతోష్, మాజీ ఉపసర్పంచ్ భూమన్న తదితరులు పాల్గొన్నారు.
జన్నారం: మండల కేంద్రంలోని ధర్మారం చౌరస్తా నుంచి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు బీఆర్‌ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ‘బాకీ కార్డులు’ పంపిణీ చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తోందని విమర్శించారు. హామీలన్నీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కొమిరే ఈశ్వర్‌బాయి, ఉట్నూర్ మాజీ జెడ్పీటీసీ చారులత, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి సులువ జనార్దన్, నాయకులు వినయ్‌కుమార్, ప్రసాద్‌నేత, ఫజల్‌ఖాన్, సంతోష్‌కుమార్, భరత్‌కుమార్, సత్యం, మున్వర్‌అలీఖాన్ తదితరులున్నారు.


