సీహెచ్‌పీలో టిప్పర్‌ బోల్తా | - | Sakshi
Sakshi News home page

సీహెచ్‌పీలో టిప్పర్‌ బోల్తా

Sep 5 2026 5:43 AM | Updated on Sep 5 2026 5:43 AM

శ్రీరాంపూర్‌: శ్రీరాంపూర్‌ ఏరియాలోని సీహెచ్‌పీలో ప్రమాదవశాత్తు టిప్పర్‌ బోల్తా పడింది. శుక్రవారం ఉదయం 20 టన్నుల సామర్థ్యం ఉన్న టిప్పర్‌ అన్‌లోడింగ్‌ కోసం ర్యాంపు ఎక్కుతుండగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా టిప్పర్‌ బ్రేక్‌లు పని చేయకపోవడంతో బోల్తా పడింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ ఐలయ్య కిందకు దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బంకర్‌ వద్ద సరైన రక్షణ చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వీరభద్రయ్య పేర్కొన్నారు. సీహెచ్‌పీలో డీజీఎం స్థానం భర్తీ చేయకుండా ఇన్‌చార్జీలతోనే వెళ్లదీస్తున్నారని, దీంతో రక్షణపై పర్యవేక్షణ లోపించి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

కాలువలో పడి యువకుడి దుర్మరణం

ముత్తారం: మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సాయిరాం(21) ప్రమాదవశాత్తు బైక్‌ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలో పడి శుక్రవారం మృతి చెందాడు. ఎస్సై కథనం ప్రకారం.. సాయిరాం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లిలోని తమ బంధువు ఇంటికి చుట్టపుచూపుగా వచ్చాడు. పనిమీద ఖమ్మంపల్లి నుంచి హరిపురం వచ్చి మళ్లీ ఖమ్మంపల్లికి తిరిగి వెళ్తున్న క్రమంలో కేశనపల్లిలోని ఎస్సారెస్పీ కాలువ వద్ద బైక్‌ అదుపుతప్పి కాలువలో పడి దుర్మరణం చెందాడు. మృతుడి బంధువు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్‌ వివరించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు..

నిర్మల్‌టౌన్‌: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన జిల్లా కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చింతకుంటవాడ కాలనీకి చెందిన పోలకొండ లక్ష్మీనారాయణ వర్మ (50) శాంతినగర్‌లో జరిగిన శుభకార్యానికి వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా జయశంకర్‌ కూడలి వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే లక్ష్మీనారాయణ వర్మను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య ఉండగా, సంతానం లేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

చెరువులో పడి బాలుడు..

కుభీర్‌: ఎల్లమ్మ చెరువులో గత నెల 10వ తేదీన ఇద్దరు చిన్నారులు ఈతకు వెళ్లి మృతిచెందిన విషయం మరవక ముందే శుక్రవారం మరో బాలుడు చెరువులో పడి మృతిచెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవిదాస్‌ (16) శుక్రవారం ఉదయం గొర్రెలను మేపేందుకు ఎల్లమ్మ చెరువు కట్ట వద్దకు ఇతరులతో కలిసి వెళ్లాడు. మధ్యాహ్నం చెరువులో గొర్రెలు నీరు తాగుతుండగా ఒక గొర్రెపిల్ల నీటిలోకి వెళ్లింది. దానికి బయటకు తీసేందుకు నీటిలోకి వెళ్లి గుంతలో పడిపోయాడు. గమనించిన కాపరులు వెంటనే బయటకు తీయగా అప్పటికే బాలుడు మృతిచెందాడు. దేవిదాస్‌కు తల్లి, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తల్లి గోదావరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.

కడుపు నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య

బజార్‌హత్నూర్‌: కడుపునొప్పి భరించలేక యువతి కోలపురి స్రవంతి(18) ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఎస్సై రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మోర్కండి గ్రామానికి చెందిన కోలపురి గంగన్న –అడెల్లబాయిల కూతురు స్రవంతి గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. గురువారం తల్లితండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు గమనించి వెంటనే స్రవంతిని ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందింది. తండ్రి గంగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్‌ తెలిపారు. స్రవంతి ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement