హైకోర్టు జడ్జి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి నగేష్ భీమపాక బెల్లంపల్లి, మందమర్రిలో కోర్టులు ప్రారంభం
బెల్లంపల్లి/మందమర్రిరూరల్: ప్రకృతితోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి నగేష్ భీమపాక అన్నారు. శనివారం జిల్లాలోని బెల్లంపల్లిలో రూ.4.50కోట్ల వ్యయంతో నిర్మించిన జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్‌క్లాస్ కోర్టు భవనం, మందమర్రిలో ఏర్పాటు చేసిన కోర్టు ఆఫ్ జూనియర్ సివిల్ జడ్జి కం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్‌క్లాస్ కోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి నగేష్ మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎకరం భూమి ఉన్నా సరేకనీసం పావు ఎకరంలో మొక్కలు నాటి సంరక్షించుకోవాలని తెలిపారు. ఘర్షణ వాతావరణం మంచిది కాదని, సామరస్యంగా వ్యవహరించడం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ప్రజలు అహంకారాన్ని దూరం చేసి సమాజంలో తోటివారిని గౌరవిస్తూ సంతోషంగా బతకాలని అన్నారు. సమాజంలో గొడవలకు అహంకారమే ప్రధాన కారణమని, కొద్దిసేపు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎలాంటి గొడవలు ఉండవని తెలిపారు. సింగరేణి ఉద్యోగులు చీకటిలో కష్టపడుతూ బొగ్గు వెలికితీసి దేశానికి వెలుగులు పంచుతున్నారని, వారు అభినందనీయులని కొనియాడారు. కోర్టు పరిధిలోని కేసులను త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మందమర్రి జడ్జిగా నిరోష హైకోర్టు జడ్జి నగేష్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. న్యాయమూర్తి నగేష్‌ను శాలువా, గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు ఏ.వీరయ్య, శారదాదేవి, జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్, మంచిర్యాల జిల్లా రెండవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి, బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శాంతి సోనీ, మందమర్రి కోర్ట్ ఆఫ్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఇంచార్జి జడ్జి కే.నిరోష, రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా, మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త సత్తయ్య, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు అనిల్ కిరణ్ కుమార్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు టి.గోపి కిషన్‌సింగ్, అంకెం శివకుమార్, చిప్ప మనోహర్, అశోక్, న్యాయవాదులు పాల్గొన్నారు.
మూడు కేసుల విచారణ
బెల్లంపల్లి నూతన కోర్టు భవనాన్ని ప్రారంభించిన అనంతరం మూడు కేసులను బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శాంతి సోనీ విచారించారు. ప్రత్యక్షంగా పరిశీలించిన హై కోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక ఆమెను ప్రశంసించారు. కోర్టు లైబ్రరీకి హైకోర్టు జీపీ, బెల్లంపల్లి వాసి గడ్డం కిరణ్‌కుమార్ రూ.50 వేలు, హైకోర్టు ఏజీపీ ఎస్.లక్ష్మినారాయణ రూ.25 వేలు విరాళం అందజేస్తామని ప్రకటించారు. బెల్లంపల్లికి సబ్ కోర్టు మంజూరు చేయాలని బార్ కౌన్సిల్ సభ్యులు కోరగా.. ప్రతిపాదనలు పంపిస్తే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు కృషి చేస్తానని హైకోర్టు జడ్జి నగేష్ తెలిపారు.


